స్ఫూర్తిగా నిలుస్తున్న వైద్య సిబ్బంది 

3 Aug, 2020 03:53 IST|Sakshi
ఆదివారం టిమ్స్‌లో వైద్య సేవల గురించి రోగులను ఆరా తీస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌ 

టిమ్స్‌లో 1,035 పడకలు

అవసరం మేరకు డాక్టర్లను కేటాయిస్తాం

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల  

గచ్చిబౌలి (హైదరాబాద్‌): కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు నిర్విరామంగా చికిత్స అందిస్తూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్ఫూర్తి నింపుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కొనియాడారు. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆస్పత్రికి అవసరమైనంత మంది డాక్టర్లను కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని టిమ్స్‌ను మంత్రి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, శానిటేషన్‌ సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉం టుందన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులలో లేని సదుపాయాలు కూడా ప్రభుత్వ ఆస్పత్రులలో ఉన్నాయని, విశాలమైన గదులలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇంజక్షన్లు లేవని ప్రైవేట్‌ ఆస్పత్రులు చేతులు ఎత్తివేస్తున్న క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రులలో చేరిన వారికి అత్యాధునిక, ఖరీదైన వైద్యం అందిస్తున్నామని, బాధితులు ఇక్కడే చికిత్స చేయించుకోవాలన్నారు.

టిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రతి పేషెంట్‌ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని మంత్రి చెప్పారు. చికిత్స పొందుతున్న రోగులతో మంత్రి మాట్లాడి వారిలో భరోసా నింపారు. చికిత్స, భోజనం ఎలా ఉందని ఆరా తీశారు. సదుపాయాలపై పేషెంట్లు సంతృప్తిగా ఉన్నారని తెలి పారు. అనంతరం అక్సిజన్‌ కొరత లేకుండా చూడా లని టిమ్స్‌ డైరెక్టర్‌ విమలా థామస్‌ను ఆదేశించారు. టిమ్స్‌లో 1,035 బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా చికిత్సకు రూ. 10 వేల కంటే ఎక్కువ ఖర్చు కాదని చెప్పారు.  రోజుకు లక్ష నుంచి రెండు లక్షలు వసూలు చేస్తున్నట్లు ప్రైవైట్‌ ఆస్పత్రులపై ఫిర్యాదులు రావడంతో విచారణకు కమిటీ ఏర్పాటు చేశామ న్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు