3 నెలలు.. వేల మందికి ఉపాధి

11 Jan, 2021 00:56 IST|Sakshi
ఆదివారం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో ముదిరాజ్‌ ఆత్మగౌరవ భవన్‌ నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌. చిత్రంలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కేకే

శిక్షణతో కూడిన ఉపాధి కల్పనకు ప్రాధాన్యత 

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ సరికొత్త కార్యాచరణ

ప్రభుత్వం అనుమతిస్తే ఈ నెలాఖరులోగా ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: దళిత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల ఆర్థిక సహకార సంస్థ (ఎస్సీ కార్పొరేషన్‌) సరికొత్త కార్యాచరణకు ఉపక్రమించింది. 2020–21 వార్షిక సంవత్సరం ఎక్కువ భాగం కోవిడ్‌– 19 భయంతో గడిచిపోగా.. మిగతా సమ యాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి అవ కాశాలు పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిగ్రీ చదివి నిరుద్యోగులుగా ఉన్న ఎస్సీ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనుంది. ప్రస్తుత వార్షిక సంవత్సరం మరో మూడు నెలల్లో ముగియనున్న నేపథ్యంలో తక్కువ సమయంలో శిక్షణ పూర్తి చేసి ఉపాధి కల్పించే అవకాశాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం విద్యాసంస్థలు, శిక్షణ సంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదు.

ఈ క్రమంలో శిక్షణతో కూడిన ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించిన ఎస్సీ కార్పొరేషన్‌ ప్రభుత్వానికి నివేదించి అనుమతి కోసం వేచి చూస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో డిమాండ్‌ ఉన్న కన్‌స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, హెల్త్‌ కేర్‌ రంగాల్లో నిరుద్యోగ ఎస్సీ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి టాప్‌ కంపెనీలతో ఎస్సీ కార్పొరేషన్‌ ఇప్పటికే పలు ఎంవోయూలు చేసుకుంది. దీంతో ప్రభుత్వం అనుమతిస్తే శిక్షణ తరగతులను ప్రారంభించనుంది. దీని కోసం రూ.25.8 కోట్లు ఖర్చు చేసి మూడు నెలల్లో 3,135 మందికి శిక్షణ ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించింది. నైపుణ్యాభివృద్ధి మాత్రమే కాకుండా ఉద్యోగాలు కల్పించేలా కార్యాచరణ రూపొందిచినట్లు ఎస్సీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.కరుణాకర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు