కమ్యూనిజం నుంచి కాషాయానికి..

15 Jun, 2021 07:55 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: వామపక్ష సిద్ధాంతాలతో విద్యార్థి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చివరికి కాషాయగూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న ఈటల తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చదువుకునే రోజుల్లో పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడిగా ఉంటూనే కమ్యూనిస్టు సిద్ధాంతాలు గల జమునను ప్రేమ వివాహం చేసుకున్నారు. తదుపరి పౌల్ట్రీ వ్యాపారంలోకి ప్రవేశించి, వ్యాపారవేత్తగా సక్సెస్‌ అయ్యారు. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటైన టీఆర్‌ఎస్‌ వైపు ఆకర్షితులయ్యారు. 

► 2002లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఈటల అనతి కా లంలోనే ఆ పార్టీలో కీలక నాయకుడిగా, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు.
► 2004లో కమలాపూర్‌ నుంచి పోటీచేసి తొలియత్నంలోనే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
► 2008 ఉపఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన ఆయన 2009లో తన కార్యక్షేత్రాన్ని హుజూరాబాద్‌కు మార్చి 2018 వరకు జరిగిన నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తూ వచ్చారు. 
► టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖలకు మంత్రిగా వ్యవహరించిన ఆయన నెలరోజుల క్రితం భూకబ్జా ఆరోపణలతో బర్తరఫ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వంతో తలెత్తిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటల సోమవారం కమలంతీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఈటల రాజకీయ జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది. 

ఈటలకు బాసటగా తుల ఉమ, గండ్ర నళిని
కరీంనగర్‌ రాజకీయాల్లో సుమారు 20 ఏళ్లుగా చక్రం తిప్పిన ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన సమయంలో కొందరు నాయకులే అండగా నిలిచారు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలలో దాదాపుగా ఎవరూ ఆయన వెంట బీజేపీలోకి వెళ్లలేదు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ తుమ్మేటి సమ్మిరెడ్డితో పాటు ఆయన అభిమానులు, అనుయాయులు ఢిల్లీకి వెళ్లి బీజేపీ కండువాలు కప్పుకున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వారిలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ తుల ఉమ ఒక్కరే ఈటలకు బాసటగా నిలిచారు. 2004లో టీడీపీ నుంచి కరీంనగర్‌ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన గండ్ర నళిని తరువాత కాలంలో టీఆర్‌ఎస్‌లో ముఖ్య నాయకురాలిగా ఉన్నారు. ఆమె కూడా ఈటలతోపాటు బీజేపీలో చేరారు. గతంలో ఈటల వర్గీయులుగా, ఆయన సన్నిహితులుగా పేరున్న ఉమ్మడి కరీంనగర్‌ నాయకులెవరూ ఆయన వెంట లేకపోవడం గమనార్హం.

బీజేపీకి కరీంనగరే పెద్దదిక్కు
ఉమ్మడి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కరీంనగర్‌ ముఖ్యమైన కేంద్రంగానే ఉంది. 
1985లోనే ఉమ్మడి కరీంనగర్‌లోని మెట్‌పల్లి నుంచి సీహెచ్‌ విద్యాసాగర్‌రావు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా వ్యవహరించారు. 
1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 
1998, 1999లలో కరీంనగర్‌ ఎంపీగా గెలి చి కేంద్ర మంత్రిగానూ వ్యవహరించారు. 
 విద్యాసాగర్‌రావుతోపాటు గుజ్జుల రామకృష్ణారెడ్డి సైతం 1999 ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు.
 2014, 2018లో కరీంనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్‌ కుమార్‌ 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా విజయం సాధించారు. 
 తరువాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులై, ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో కీలకంగా మారారు. ఈ క్రమంలో బీజేపీలో చేరిన పేరున్న పెద్ద నాయకుడు ఈటల రాజేందర్‌ కావడం గమనార్హం. 

టీఆర్‌ఎస్‌ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి ఆరుసార్లు గెలిచిన ఈటల అటుఇటుగా రెండు దశాబ్దాలకు పార్టీ మారి బీజేపీలో చేరారు. బీజేపీలో కొత్త అధ్యాయం మొదలైందని ఆయన భావిస్తున్నారు. తన రాజీనామా నేపథ్యంలో ఆర్నెల్లలో జరిగే హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. ఈ ఎన్నిక ఈటలకే కాక బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకం కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ సొంత జిల్లాలో సీనియర్‌ నేత ఈటల బీజేపీ నుంచి పోటీ పడుతున్న నియోజకవర్గంగా రాష్ట్ర ప్రజలను ఆకర్షించబోతోంది.  

చదవండి: పార్టీ మార్పుపై ఎల్‌.రమణ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు