నేడు ఈటల రాజీనామా.. బీజేపీలోకి రాథోడ్‌ 

12 Jun, 2021 04:19 IST|Sakshi

గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి.. ఆ తర్వాత అసెంబ్లీకి 

14న ఢిల్లీ వెళ్లి.. అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరిక

 సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ శాసన సభ్యత్వంతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీకి మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ శనివారం రాజీనామా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఈనెల 14న బీజేపీలో చేరికకు సంబంధించి ముహూర్తం ఖరారు కావడంతో శనివారం అధికారికంగా రాజీనామా సమర్పించనున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ శివారులోని శామీర్‌పేటలో ఉన్న ఆయన నివాసం నుంచి బయల్దేరి ఉదయం 10.30 గంటలకు అనుచరులతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం అసెంబ్లీకి చేరుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి ఈటల రాజేందర్‌ తన రాజీనామా లేఖ అందజేసే అవకాశముంది. టీఆర్‌ఎస్‌కు రాజీనామా పత్రాన్ని తన దూత ద్వారా లేదా ఈ–మెయిల్‌ ద్వారా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు పంపనున్నారు. ఈటల రాజీనామాకు సంబంధించి శుక్రవారం రాత్రి వరకు ఎలాంటి సమాచారం లేదని తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి. 


14న బీజేపీలో చేరిక.. 
ఈ నెల 14న రాష్ట్రానికి చెందిన బీజేపీ ముఖ్య నేతలతో కలసి ఈటల రాజేందర్‌ ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అదేరోజు సాయంత్రం బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, తరుణ్‌ ఛుగ్‌ తదితరుల సమక్షంలో ఈటల రాజేందర్‌ ఆ పార్టీలో చేరుతారు. ఇటీవల రెండు రోజుల పాటు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించిన ఈటల.. వర్షాల కారణంగా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక హుజూరాబాద్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించేందుకు ఈటల షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్, రాష్ట్ర పార్టీ సీనియర్‌ నేతలు శుక్రవారం షామీర్‌పేటలోని ఈటల నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు.

బీజేపీలోకి రాథోడ్‌ 
నిర్మల్‌: ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ, ఉమ్మడి జిల్లా సీనియర్‌ నాయకుడు రమేశ్‌ రాథోడ్‌ బీజేపీలో చేరడం ఎట్టకేలకు ఖరారైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి ఈ నెల 14న ఆయన కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీలో చేరిన అనంతరం ఖానాపూర్‌ నియోజకవర్గంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. టీడీపీలో సుదీర్ఘకాలంపాలు పనిచేసిన రమేశ్‌ రాథోడ్‌.. 1999లో ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా, 2009లో ఆదిలాబాద్‌ ఎంపీగా గెలిచారు. 2017లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖానాపూర్‌ టికెట్‌ ఇవ్వనందుకు నిరసనగా రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఖానాపూర్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన చేరికతో బీజేపీకి మరింత పట్టు పెరగనుందని భావిస్తున్నారు. ఆయన భార్య సుమన్‌ రాథోడ్‌ రెండుసార్లు ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

మరిన్ని వార్తలు