‘రాష్ట్రంలో అధికారులను కూడా బానిసలుగా మార్చారు’

23 Jun, 2021 07:41 IST|Sakshi

సాక్షి, వీణవంక (కరీంనగర్‌): ‘రాష్ట్రంలో అధికారులను కూడా బానిసలుగా మార్చారు. మీ ప్రాప్తం లేకుండా వారికి మంచి పదవి కూడా రాని పరిస్థితి నెలకొంది. బానిసలుగా మారితే తప్పా పోస్టింగ్‌లు రాని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సీఎం కేసీఆర్‌ తీరుపై ధ్వజమెత్తారు. వల్బాపూర్‌ గ్రామం నుంచి గంగారం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చల్లూరులో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకొని.. ఓటు మాత్రం తనకు వేయాలని కోరారు. 20 ఏళ్లలో ఎప్పుడూ గొడవలకు తావు లేదని.. ఎప్పుడైనా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకున్నామని తెలిపారు. ఈసారి సీఎం కేసీఆర్‌ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు.

ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు వృత్తి ధర్మాన్ని పక్కనపెట్టి కొంత మంది బానిసలుగా మారారని.. మండలానికి ఒకరి చొప్పున ఐదు మంది మంత్రులు, గ్రామానికి ఒక ఎమ్మెల్యే లెక్క గొర్ల మంద మీద తోడేలు పడ్డటు పడుతున్నారని విమర్శించారు. ఇంత దౌర్భాగ్యం దేశంలో ఎక్కడైన ఉందా అని ప్రశ్నించారు. కొంతమంది కురుస నాయకులు పోయినంత మాత్రాన పోయేది లేదని, హుజూరాబాద్‌లో ఏం జరుగుతోందని అమెరికాలో ఉన్నవారు, దేశవ్యాప్తంగా ఉన్నవారు చూస్తున్నారని పేర్కొన్నారు. ఆత్మగౌరవం దక్కించుకోవాలని అందరూ చూస్తున్నారని.. అందుకే కమలం గుర్తుకు ఓటు వేయాలని కో రారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అ«ధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

జమ్మికుంటలో ఘన స్వాగతం
జమ్మికుంట: జమ్మికుంటలో మంగళవారం బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గాంధీచౌరస్తా వద్ద ముస్లిం మహిళలు స్వాగతం పలికారు. అనంతరం ఈటల గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్‌ చైర్‌పర్సన్‌ దేశిని స్వప్న, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెళ్లి సంపత్‌రావు, పట్టణ అధ్యక్షుడు జీడీ మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు. 

చదవండి: వైఎస్సార్‌ చేయూతతో కోటి మందికి మేలు 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు