కరోనాకు చంపే శక్తి లేదు

29 Aug, 2020 04:18 IST|Sakshi

నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇబ్బందులే: మంత్రి ఈటల రాజేందర్‌ 

ముందుగా గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు

అందుకే పరీక్షల సంఖ్య పెంచాం 

త్వరలో మరో 100 బస్తీ దవాఖానాల ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: కరోనాకు చంపే శక్తి లేదని, అయితే నిర్లక్షం వహిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. వైరస్‌ను ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చని, అందుకే పరీక్షల సంఖ్య పెంచినట్లు చెప్పారు. దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాల శాతం తక్కువగా ఉందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో శుక్రవారం మంత్రి ఈటల సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి. కానీ అప్పుడు ఇంతలా ప్రచారమూ జరగలేదు. ప్రజలూ భయపడలేదు. కానీ ఇప్పుడు ఎక్కువ భయపడుతున్నారు.

అందుకే ముందుగా ఆ భయాన్ని పోగొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసింద’ని మంత్రి అన్నారు. పట్టణ పేదల ముంగిటికి వైద్యసేవలు తీసుకురావడమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే 200 ప్రారంభించామని, మరో 100 బస్తీ దవాఖానాలు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. వీటిలో సాయంత్రం క్లినిక్‌లు కూడా ప్రారంభించామన్నారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ), బస్తీ దవాఖానాల్లో 145 చోట్ల టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. ఇవి కాకుండా మొబైల్‌ క్యాంప్‌లు కూడా పెడుతున్నట్లు పేర్కొన్నారు. వారం నుంచి తెలంగాణలో రోజుకు 50–60 వేల టెస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు. 

బాధితులను వెలివేయకూడదు...
కరోనా బాధితులను, వారి కుటుంబాలను చిన్నచూపు చూడడం, వెలివేసినట్లు ప్రవర్తించడం మంచిది కాదని మంత్రి అన్నారు. ఈ రెండింటినీ పోగొట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ముఖ్యంగా రెసిడెన్షియల్‌ అసోసియేషన్లు ముందుకు రావాలని కోరారు. అలాగే బస్తీల్లోనూ అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైతే స్వయంగా తానే వచ్చి పాల్గొంటానని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వాళ్ళు ఉండేందుకు కమ్యూనిటీ హాల్స్, క్లబ్‌ హౌజ్‌లను ఇస్తే, వారికి మందులు, భోజనం ప్రభుత్వం నుంచి అందజేస్తామని చెప్పారు. పరీక్షలు, చికిత్స ఎక్కడ అందుతుందో వివరాలు తెలియజేయడానికి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం రూ.30 లక్షల వరకూ వసూలు చేయడం సబబు కాదన్నారు. ఇలాంటి కష్టసమయంలో వ్యాపారం చేయవద్దన్నారు. ప్రభుత్వా సుపత్రుల్లో అన్ని వసతులూ అందుబాటులో ఉన్నాయని, ప్రైవేట్‌కి వెళ్లి అప్పులపాలు కావొద్దని ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు