ప్రతి ఇంట్లోకి కరోనా వచ్చింది

7 Sep, 2020 04:14 IST|Sakshi

ధైర్యంగా ఉంటే వైరస్‌ను జయించవచ్చు

ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రజలకు భరోసా కల్పించాలి

ఆరోగ్య కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటల

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడు కరోనా ప్రతీ ఇంట్లోకి వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చని, ఈ ధైర్యాన్ని ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రజలందరికీ కల్పించాలని పిలుపునిచ్చారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయంలో ఆదివారం 22 వేల మంది ఆశ వర్కర్లు, 500 మంది ఏఎన్‌ఎంలతో ఆయన జూమ్‌ ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ వాకాటి కరుణ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ ఆరు నెలల అనుభవంలో కరోనాకి చంపే శక్తిలేదని తెలిసిపోయిందన్నారు. 99 శాతం మంది కోలుకొని బయటపడుతున్నారన్నారు.

ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు చికిత్స ఒక్కటేనన్నారు. అనవసరంగా కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్లాస్మా థెరపీ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ వ్యక్తులను మొదటి రోజే గుర్తించగలిగితే వ్యాప్తిని అరికట్టవచ్చని, ప్రాణాలు కాపాడవచ్చన్నారు. కరోనా వైరస్‌ రాష్ట్రంలోకి వచ్చిన మొదటి రోజు నుండి హెల్త్‌ వారియర్స్‌ కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు. కిందిస్థాయిలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ కరోనాపై పూర్తి అవగాహన వచ్చిందన్నారు. ప్రజలను కూడా చైతన్యపరిచి అతి త్వరలో పూర్తిగా అడ్డుకట్టవేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇలాంటి వ్యాధులను ఎదుర్కోగలమని సీఎం కేసీఆర్‌ పదేపదే చెబుతున్నారని మంత్రి గుర్తుచేశారు.

లక్షణాలుంటే పరీక్ష చేయించుకోవాలి
ఇతర సీజనల్‌ వ్యాధులు, కరోనా ఒకటే లక్షణాలు కలిగి ఉంటాయని, కాబట్టి అనుమానిత లక్షణాలుంటే తొందరగా పరీక్షలు చేయించుకుని నిర్ధారణ చేసుకోవాలని మంత్రి ఈటల సూచించారు. ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చిన వారికి లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయించాలన్నారు. కరోనాపై పోరులో దేశంలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇది గర్వ కారణమని, వైద్య సిబ్బంది వల్లనే ఇది సాధ్యమైందన్నారు. కోవిడ్‌ సమయంలో పనిచేయడం మీ అందరికీ గొప్ప జ్ఞాపకమన్నారు. ‘భరోసా కల్పించండి. ప్రాణాలు కాపాడండి’ అంటూ ఆశ, ఏఎన్‌ఎంలకు మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఆశ, ఏఎన్‌ఎంలతో ఆయన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వారి సమస్యలన్నీ తీరుస్తామని హామీనిచ్చారు. జీతం పెంచే విషయం సీఎంతో చర్చిస్తామన్నారు. కరోనా తరువాత ప్రతి జిల్లా ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలతో ప్రత్యేకంగా సమావేశమవుతామన్నారు. భద్రాద్రి జిల్లా ఎర్రగుంట పీహెచ్‌సీకి చెందిన సుశీల, వనపర్తి జిల్లా మదనపురం లీలమ్మ తదితరులను మంత్రి అభినందించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు