అర్హులందరికీ దళితబంధు 

21 Sep, 2021 01:24 IST|Sakshi

స్వయం ఉపాధి కోసమే పథకం: మంత్రి హరీశ్‌రావు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ప్రభుత్వం కరీంనగర్‌ జిల్లా లోని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన కుటుంబాలందరికీ అమలు చేస్తామని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో దళితబంధుపై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్, కలెక్టర్, క్లస్టర్‌ అధికారులు, బ్యాంకర్లతో హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు.

వివాహమైన ప్రతి దళిత కుటుంబానికీ పథకం డబ్బులు జమ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. దళితబంధు డబ్బులతో స్వయంఉపాధి కోసం ఎంపిక చేసుకున్న యూనిట్లు స్థాపించుకోవాలని సూచిం చారు. దళితబంధు ద్వారా వచ్చే రూ.10 లక్షలతో లబ్ధిదారులు 4 యూనిట్లు కూడా స్థాపించుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, 65 ఏళ్లలోపు వయసు ఉన్న దళితులందరికీ పథకం అందుతుందని చెప్పారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో డబ్బులు అందని దళిత కుటుంబాలందరికీ మూడురోజులలోపు వారి ఖాతాలో జమ చేయాలని మంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు.

యూనిట్లు స్థాపించుకునే వరకు ఖాతాలో నిల్వఉండే డబ్బులకు బ్యాంకులు వడ్డీ ఇస్తాయన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ మాట్లాడుతూ ఈ నెల 21న నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో దళితబంధు రాని వారి వివరాలు సేకరించి, అర్హులకు వెంటనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. ఇల్లందకుంట మండలానికి చెందిన కొత్తూరి జయ, ఆమె భర్త మొగిలి, హుజూరాబాద్‌ మండ లం కనుకులగిద్దెకి చెందిన కొత్తూరి రాధ, భర్త మొగిలి, కమలాపూర్‌ మండలం, శనిగరం గ్రామానికి చెందిన రాజేందర్‌ను కరీంనగర్‌ డెయిరీ పశువుల డాక్టర్‌ రహీం అక్తర్, మండల పంచాయతీ అధికారి రవి హరియాణాకు తీసుకెళ్లారని, రోహతక్‌ జిల్లాలో పాడి గేదెలు కొనుగోలు చేశారని కలెక్టర్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు