నగరాన్ని రక్షిస్తున్నవి అవే!

18 Mar, 2022 01:19 IST|Sakshi

జంట జలాశయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ.. 

‘సాక్షి’ ఇంటర్వ్యూలో పర్యావరణవేత్త లుబ్నా సార్వత్‌ 

కుండపోత వానలు, వరదల నుంచి హైదరాబాద్‌కు రక్షణ అవే 

జీవో 111 ఎక్కడికీ పోదు.. 

కబ్జాలు తొలగించకుండా.. జీవోను తొలగిస్తామనడం సరికాదనివ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జంట జలాశయాలు హైదరాబాద్‌ మహానగర సహజసిద్ధ పర్యావరణ వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్నాయని.. అన్నికాలాల్లో నగరాన్ని కాపాడుతున్న వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పర్యావరణవేత్త డాక్టర్‌ లుబ్నా సార్వత్‌ స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడటం, తాగునీటి సరఫరా, పరిసర ప్రాంతాల సాగు అవసరాల కోసం ఈ రెండు రిజర్వాయర్లను నిర్మించిన విషయాన్ని ప్రభుత్వాలు మరవొద్దని సూచించారు. జీవో 111 ఎక్కడికీ పోదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కొత్త కొత్త రిజర్వాయర్లు కడుతూ.. ఉన్న బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లను ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. జంట జలాశయాలు, జీవో 111 తొలగింపుతో ముడిపడిన అం శాలపై ఆమె ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చా రు. ముఖ్యాంశాలు లుబ్నా సార్వత్‌ మాటల్లోనే.. 

‘జంట’ వరప్రదాయిని! 
‘‘దశాబ్దాలుగా హైదరాబాద్‌కు గుర్తింపుగా ఉన్న జలాశయాలతో.. పర్యావరణం, జీవవైవిధ్యం, పచ్చదనంతో ముడిపడిన జీవో 111 ఎక్కడికి పోదు. దానిని ఎవరూ ఏమీ చేయలేరు. సీఎంగా ప్రజలకు ఉన్నతమైన సదుపాయాలు కల్పించాలనే భావన ఉండాలి. కానీ దాదాపు 80ఏళ్లకుపైగా కొం డలపై నుంచి, ఔషధ గుణాలున్న అటవీ సంపద మీదుగా, చిన్న చిన్న వాగులు వంకలుగా ఈ రెండు రిజర్వాయర్లలోకి వర్షపు నీరు చేరుతోంది. మళ్లీ గ్రావిటీ ద్వారానే ఆసిఫ్‌నగర్, మీరాలం ఫిల్టర్‌బెడ్‌ లోకి నీటిసరఫరా జరుగుతోంది. వేసవిలో వచ్చే వడగాడ్పుల నుంచి నగరాన్ని కాపాడుతూ చల్లగా ఉంచుతోంది అలా వరప్రదాయినిగా ఉన్న ఈ రెండు చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. అవిలేకుంటే.. నిండా ముంచే వరదలొస్తే పూర్తిగా నష్టపోయేది హైదరాబాదేనని అందరూ గుర్తించాలి. 

‘మినరల్‌ రిచ్‌’ నీళ్లు అవి 
ఒక్కో నది, ఒక్కో చెరువు నీటి రుచి వేరుగా ఉంటుంది. ప్రకృతిపరంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి ‘మినరల్‌ రిచ్‌’ తాగునీరు సహజసిద్ధంగా గ్రావిటీ ద్వారా సరఫరా అవుతుంటే.. కాదనడంలో అర్థం లేదు. కృష్ణా నది క్రమంగా కుంచించుకుపోయి కాలుష్యం బారిన పడుతోంది. కృష్ణా, గోదావరి నీటిని పైపుల ద్వారా వచ్చే వందేళ్లకు సరఫరా చేస్తామనడం నమ్మశక్యంగా లేదు. భవిష్యత్‌లో నీటి కరువు ఏర్పడితే, పైపుల నీటి సరఫరా ఆగిపోతే.. ఏం చేయగలరు? జంట జలాశయాలను కాపాడుకోవాలి. 

కబ్జాలు తొలగించకుండా.. జీవోనే వద్దంటారా ? 
గత కొన్నేళ్లుగా జంట రిజర్వాయర్ల క్యాచ్‌మెంట్లలో భారీగా అక్రమ కట్టడాలు పెరిగాయి. వాటిని తొలగించి జలాశయాలను పరిరక్షించకుండా.. జీవో 111ను ఎత్తేస్తామనడంలో ఆంతర్యమేంటి? చిల్కూరు రిజర్వ్‌ ఫారెస్ట్, వికారాబాద్‌ అటవీ ప్రాంతం తదితరాలతో ముడిపడి, జతకలిసిన ఈ జలాశయాలను కాపాడుకోవాలి.  

సీఎం వ్యాఖ్యలను తొలగించాలి
అసెంబ్లీలో జీవో 111పై సీఎం కేసీఆర్‌ మాట్లాడినపుడు జంట జలాశయాలు మృతి చెందాయంటూ చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాను. 2016–17లో, తర్వాత గత రెండేళ్లలో వచ్చిన భారీ వరదల నుంచి.. సజీవంగా ఉన్న ఈ రెండు రిజర్వాయర్లే హైదరాబాద్‌ను కాపాడాయి. వేగంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రోజుల్లో తక్కువ సమయంలో కుండపోత వానలు పడవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో హైదరాబాద్‌ను కాపాడగలిగేది ఈ రెండు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లే అన్న విషయం మరవొద్దు. ఇప్పుడు ఎండాకాలంలో (మార్చి 16న) కూడా ఉస్మాన్‌సాగర్‌ నుంచి 91 మిలియన్‌ గ్యాలన్ల నీటిని, హిమాయత్‌సాగర్‌ నుంచి 16 మిలియన్‌ గ్యాలన్ల నీటిని.. హైదరాబాద్‌ ప్రజలకు సరఫరా చేసినట్టు వాటర్‌బోర్డు వెబ్‌సైట్‌ తాజా గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 

మరిన్ని వార్తలు