కన్వీనర్‌‌ కోటా కిందే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు!

23 Jan, 2021 08:02 IST|Sakshi

10% కోటా అమలుపై ఉన్నత విద్యామండలి కసరత్తు 

65 వేల సీట్లు అదనం! 

వీటిని కన్వీనర్‌ కోటాలోనే కలిపి రిజర్వేషన్లు అమలు  

 వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు 

సాక్షి, హైదరాబాద్‌:  ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో వాటి అమలుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. జాతీయ స్థాయిలో అన్నీ కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలే ఉన్నందున, 10 శాతం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల కంటే ప్రైవేటు విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్నాయి. డిగ్రీ, పీజీ వంటి ఉన్నత, వృత్తి, సాంకేతిక విద్యా సంస్థలన్నీ కలిసి దాదాపు 2,500కు పైగా ఉండగా, వాటిల్లో దాదాపు 7 లక్షల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో డిగ్రీ కాలేజీల్లోని 4 లక్షల సీట్లు మినహాయిస్తే మిగిలిన 3 లక్షల సీట్లలో ప్రభుత్వం ఏటా 2.5 లక్షల వరకే అడ్మిషన్లకు అనుమతి (అనుబంధ గుర్తింపు) ఇస్తోంది. ఈ లెక్కన 6.5 లక్షల సీట్లకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కోసం అన్ని రకాల కోర్సులకు కలిపి 65 వేల సీట్లు అదనంగా వస్తాయి.

మేనేజ్‌మెంట్‌ కోటా యధాతథం..: 65 వేల సీట్లను కన్వీనర్‌ కోటా కిందకే తెచ్చి రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. మొత్తం సీట్లలో 30 శాతం సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటా కింద భర్తీ చేస్తుండగా, మిగతా 70 శాతం కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌ కోటాను పక్కనపెట్టి, పెంచిన 10 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో కలిపి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఈబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేస్తుండటంతో ఆ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి సంప్రదించారు. ఈ సందర్భంగా ఏపీలో ఇదే విధానం అమలు చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. కాగా వచ్చే విద్యా సంవత్సరంలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలు చేసేందుకు చర్యలు చేపడతామని పాపిరెడ్డి వివరించారు.  

మరిన్ని వార్తలు