ఖైదీ నెంబర్‌ 2001.. నాగేశ్వర్‌రావు రిమాండ్‌ రిపోర్టులో కీలకాంశాలు

14 Jul, 2022 08:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివాహితపై తుపాకీ గురిపెట్టి అత్యాచారం చేయడంతో పాటు ఆమెను భర్తతో సహా కిడ్నాప్‌ చేసి హత్యాయత్నం చేసిన మాజీ ఇన్‌స్పెక్టర్‌ కె.నాగేశ్వర్‌రావుకు చర్లపల్లి జైలు అధికారులు అండర్‌ ట్రయల్‌ (యూటీ) ఖైదీ నెం.2001 కేటాయించారు. సోమవారం నాగేశ్వర్‌రావును అరెస్టు చేసిన వనస్థలిపురం పోలీసులు జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం నాగేశ్వర్‌రావును పది రోజుల పాటు తమ కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన నోటీసులను పోలీసులు బుధవారం జైలులో నాగేశ్వర్‌రావుకు ఇచ్చారు. వనస్థలిపురం పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పలు కీలకాంశాలు ప్రస్తావించారు.

ప్రాథమిక విచారణలోనే నాగేశ్వర్‌రావు తన నేరం అంగీకరించినట్లు అందులో రాశారు. హస్తినాపురంలోని వెంకటరమణ కాలనీలో ఉండే బాధితురాలి ఇంటికి నాగేశ్వర్‌రావు ఆ రోజు రాత్రి 9.30 గంటల సమయంలో వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, ఆ ఫీడ్‌ను సేకరించామని పేర్కొన్నారు. ఉదంతం జరిగిన తర్వాత కేసు నమోదైన విషయం తెలుసుకున్న నాగేశ్వర్‌రావు బెంగళూరు పారిపోయాడని, ఆదివారం రాత్రి నగరానికి చేరుకోగా పట్టుకున్నామని కోర్టుకు తెలిపారు. ఈ ఉదంతానికి సంబంధించిన మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్‌లో డిపాజిట్‌ చేసి ఉన్న నాగేశ్వర్‌రావు పిస్టల్‌తో పాటు ఆయన ఇంటి నుంచి నేరం చేసినప్పుడు ధరించిన దుస్తులు తదితరాలు స్వాధీనం చేసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

బాధితురాలి ఇంటి దగ్గర, ఇబ్రహీంపట్నం రహదారిలో, అక్కడ నుంచి కొత్తపేటకు వచ్చే మార్గంలో ఇలా అనేక ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఫీడ్‌ సేకరించామని పేర్కొన్నారు. బాధితురాలి  నుంచి  సీఆర్పీసీ 161 సెక్షన్‌ ప్రకారం వాంగ్మూలం రికార్డు చేయడంతో పాటు బాధితురాలికి వైద్య పరీక్షలు చేయించామని వివరించారు. నేరం జరిగిన ప్రాంతమైన బాధితురాలి ఇంటి నుంచి కీలకాధారాలుగా పరిగణించే రెండు గాజులు, తల వెంట్రుకలు, బెడ్‌షీట్‌ స్వాధీనం చేసుకున్నట్లు వీటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో పాటు ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద జరిగిన కారు ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలిసిన పోలీసులు, కారు మరమ్మతులకు తీసుకువెళ్లిన మెకానిక్‌లు, బాధితురాలి ఇంటి వద్ద ఉన్న వారు సహా మొత్తం 17 మందిని సాక్షులుగా పరిగణిస్తూ వారి నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.

నాగేశ్వర్‌రావుకు చెందిన కారులో బాధితురాలు, ఆమె భర్తలతో కలిసి ప్రయాణించిన ఫుటేజ్‌ను బీఎన్‌ రెడ్డి నగర్‌ వద్ద సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని, దాన్ని రికవరీ చేశామని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన నాగేశ్వర్‌రావు 2018లో బాధితురాలి భర్తను అరెస్టు చేశారు. అప్పట్లో తన కార్యాలయానికి వచ్చిన బాధితురాలిపై కన్నేశాడు. తన భర్తను కేసు నుంచి బయటపడేయాలని ఆమె కోరడంతో అంగీకరించినట్లు నటించాడు. ఆపై బెయిల్‌పై వచ్చిన బాధితురాలి భర్తను తన పొలంలో పనిలో పెట్టుకుని ఈ కథంతా నడుపుకుంటూ వచ్చాడని కేసు పూర్వాపరాలను పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో రాశారు.
చదవండి: Kadem Project: ‘కడెం’ దడ

మొత్తం 32 పేజీలు ఉన్న రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కేసుకు సంబంధించిన అంశాలతో పాటు సాక్షుల వాంగ్మూలాలను పొందుపరిచారు. మరోపక్క జైల్లో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్న నాగేశ్వర్‌రావుకు అధికారులు హైసెక్యూరిటీతో కూడిన సింగిల్‌ సెల్‌ కేటాయించారు. అతడు గతంలో అరెస్టు చేసిన నేరగాళ్లలో కొందరు జైల్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జైల్లో నాగేశ్వర్‌రావు బుధవారం పూర్తి ముభావంగా ఉన్నాడని తెలిసింది   

మరిన్ని వార్తలు