భారత రాజకీయాల్లో వైఎస్సార్‌ గొప్ప నేత 

3 Sep, 2022 02:04 IST|Sakshi
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమెస్కో విజయ్‌కుమార్, జస్టిస్‌ చలమేశ్వర్,  కేవీపీ రామచంద్రరావు, సంజయ్‌ బారు   

ఉమ్మడి ఏపీలోని ప్రతి మూలకు నీరందించాలన్నసంకల్పంతో పనిచేశారు: జైరాం రమేశ్‌ 

పోలవరంలో సింహభాగం ఖ్యాతి వైఎస్‌దే: జస్టిస్‌ చలమేశ్వర్‌ 

కేవీపీ రచించిన ‘జలయజ్ఞం– పోలవరం.. ఒక సాహసి ప్రయాణం’ పుస్తకం ఆవిష్కరణ 

సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక భారత రాజకీయాల్లోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి గొప్ప నాయకుడని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ కొనియాడారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు చాలా చరిత్ర ఉందని, కానీ వైఎస్‌ హయాంలోనే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని చెప్పారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్‌ కేవీపీ రామచంద్రరావు రచించిన ‘జలయజ్ఞం–పోలవరం.. ఒక సాహసి ప్రయాణం’ అనే పుస్తకాన్ని వైఎస్సార్‌ 13వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రధానమంత్రి మాజీ సలహాదారు, సీనియర్‌ జర్నలిస్టు సంజయ్‌ బారుకు అందజేశారు. అనంతరం జరిగిన సభలో జైరాం రమేశ్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోని ప్రతి మూలకు నీరందించే లక్ష్యంతో పని చేశారని రమేశ్‌ చెప్పారు.

ఆరోగ్యం, సాంఘిక సంక్షేమం, విద్య, సాగునీటి రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టారని తెలిపారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ ఖ్యాతిలో సింహభాగం వైఎస్‌కే దక్కుతుందన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఓట్ల పండుగ మాత్రమే కాదని, రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయడమని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు ప్రజాస్వామ్యం మిగులుతుందో లేదో అర్థం కావడంలేదని అన్నారు.

2004లో యూపీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన ఆర్కిటెక్ట్‌ వైఎస్సార్‌ అని సంజయ్‌ బారు అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్సార్‌ విగ్రహాన్ని ప్రతిష్టించాలని సూచించారు. ఎమెస్కో విజయ్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేవీపీతోపాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి, సీఎంవో మాజీ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు ప్రసంగించారు.  ఈ కార్యక్రమంలో టి. సుబ్బరామిరెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, ఆనం రామనారాయణరెడ్డి, కొణతాల రామకృష్ణ, గీతారెడ్డి, కాంగ్రెస్‌ నేత కొప్పుల రాజుతోపాటు పలువురు మాజీ ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు