విషాదం.. సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగపతిరావు కన్నుమూత

20 Oct, 2022 10:26 IST|Sakshi

సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూత

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ దురంధరుడు.. మాజీ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్సీ వెలిచాల జగపతిరావు (87) ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారు. అహర్నిశలు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ టైగర్‌ జగపతిరావుగా పేరు పొందారు. 1935లో రామడుగు మండలం గుండి గ్రామంలో జన్మించిన జగపతిరావుకు ఇద్దరు కుమారులు వెలిచాల రాజేందర్‌రావు, రవీందర్‌రావు, కూతురు శోభ ఉన్నారు. 

1970లో రాజకీయ అరంగేట్రం..
వెలిచాల జగపతిరావుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాతో ఎనలేని అనుబంధం ఉంది. 1970లోనే గుండి సహకార సంఘం చైర్మన్‌గా.. అనంతరం గంగాధర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. 

► సహకార సంఘాల సేవలను విస్తరించేందుకు 1972–77 వరకు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా విశేష సేవలందించారు. 

► 1972లోనే జగిత్యాల నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా, 1978–84 వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగారు.

► 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుండి టికెట్‌ ఆశించినా అధిష్టానం ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పార గుర్తుపై గెలిచి సంచలనం సృష్టించారు. 

► తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అనుబంధ సభ్యుడిగా తెలంగాణ లెజిస్టేచర్స్‌ ఫోరం కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 

► ఏపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా చేపట్టి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 

► 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన జగపతిరావు కవిగా కూడా సుపరిచితులు. 

► తెలంగాణ స్వరాష్ట్రం కావాల్సిందేనని కుండబద్దలు కొట్టి గణాంకాలతో సహా పలు పత్రికలకు వ్యాసాలు రాసిన ఆయన.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తప్పులు ఎత్తిచూపడంలో వెనుకంజ వేయలేదు. 

► మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా ఎన్నికైన జగపతిరావు ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంతోపాటు, కరీంనగర్‌లో మార్క్‌ఫెడ్‌ సంస్థకు ఆస్తులను కేటాయించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించారు. 

► 2017లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమానికి తన భార్య పేరిట రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. కరీంనగర్‌లోని తన ఇంటి వద్ద ప్రత్యేకంగా 5 వేల పూల మొక్కలతో బొటానికల్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. 

కరీంనగర్‌ అభివృద్ధి ఆయన చలవే..
ముక్కుసూటి మనిషిగా పేరొందిన వెలిచాల జగపతిరావు కరీంనగర్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 1994 జనవరి 12న నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని కరీంనగర్‌ పర్యటనకు తీసుకువచ్చి రాంనగర్, అంబేడ్కర్‌ నగర్, కోర్టు చౌరస్తా, కోతిరాంపూర్‌లోని నాలుగు వాటర్‌ ట్యాంక్‌ల నిర్మాణంతోపాటు ఫిల్టర్‌ బెడ్‌లను నిర్మించి సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. దీంతో ప్రజలకు నీటి సమస్య తప్పింది. తెలంగాణ విముక్తి కోసం నిజాం రజాకార్ల చేతిలో తొలి అమరుడైన అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహాన్ని జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయం ముందు ఏర్పాటు చేసి.. అప్పటి సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. 

► రాంనగర్‌లోని మార్క్‌ఫెడ్‌కు విశాలమైన మైదానం కేటాయింపుతోపాటు ప్రభుత్వ విద్యాసంస్థలు, కళాశాలల (సైన్స్‌ కళాశాల)కు స్థలాలు, అనేక క్లబ్‌ల నిర్మాణానికి స్థలాల కోసం నిధులు కేటాయించిన ఘనత జగపతిరావుకే దక్కుతుంది. విద్యుత్తు సమస్యను నివారించేందుకు దుర్శెడ్‌ వద్ద 220 కేవీ సబ్‌ స్టేషన్‌ దూరదృష్టితో ఆనాడే ప్రారంభించడం గమనార్హం.

► 1970లో రాజకీయ అరంగ్రేటం చేసిన జగపతిరావు ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, బుగ్గారం, కరీంనగర్‌ స్థానాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి రెండు సార్లు గెలిచారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌గా ఐదు సంవత్సరాలు పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఒకసారి గెలిచారు. 

► జగపతిరావు మృతిపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, మేయర్‌ వై.సునీల్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయతోపాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. జగపతిరావు అంత్యక్రియలు శుక్రవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు