అక్రమ ప్రాజెక్టులు ఆపండి, మాపైనే నిందలా

2 Jul, 2021 02:27 IST|Sakshi

ప్రతిగా మాపైనే నిందలు వేయడం సరికాదు 

ఏపీ మంత్రులు అలా మాట్లాడటం విచారకరం: శ్రీనివాస్‌గౌడ్‌ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ‘‘కృష్ణానదిపై ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని మేం అంటున్నాం. కానీ తెలంగాణలో ఉన్న సీమాంధ్రులు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతోనే తాము ఎక్కువగా మాట్లాడడం లేదని ఏపీ సీఎం, మంత్రులు అనడం విచారకరం. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోగానీ, ఇతర ప్రాంతాల్లో గానీ నివసిస్తున్న సీమాంధ్రులు ఎక్కడైనా ఇబ్బందులు పడ్డారా? రియల్‌ ఎస్టేట్, ఇతర వ్యాపారాల్లో ఇబ్బందులు పడ్డామని ఎవరైనా అన్నారా? ట్యాంక్‌ బండ్‌పై ఉన్న ఏ ఒక్క సీమాంధ్ర నాయకుడి విగ్రహాన్ని అయినా తొలగించామా? తెలంగాణలో ఉన్న సీమాంధ్రులను ఇక్కడివారు కలుపుకొని పోయి.. వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ ఏపీలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. టీఎస్‌ ఆర్టీసీ బస్సులను అక్కడి స్టేషన్లలో ఆపనివ్వలేదు. తిరుపతిలో ఓ అధికారి మమ్మల్ని అవమాన పరిచిన ఘటన కూడా ఉంది..’’అని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

గురువారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ పాలమూరును ఎడారి చేసేలా అక్రమ ప్రాజెక్టులతో నీటిని దోచుకెళ్లే ప్రయత్నం చేస్తోందని, పైగా తెలంగాణపై నిందలు మోపుతోందని శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం ఉండాలనేదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని.. మహారాష్ట్రకు నష్టం వాటిల్లకుండా వారిని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పారు. ఏపీ కూడా అలాగే పైన ఉన్న వారికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుందని భావించామన్నారు. శ్రీశైలం పూర్తిగా విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు అని, అలాంటిది విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు