ఒకే ఉత్తర్వుతో 545 ఆర్‌టీఐ దరఖాస్తులకు విముక్తి

25 Sep, 2022 04:44 IST|Sakshi

ఆర్థిక శాఖకు సంబంధించి న్యాయవాది దరఖాస్తులకు పరిష్కారం

ప్రత్యేక చొరవ తీసుకున్న ఆర్‌టీఐ చీఫ్‌ కమిషనర్‌ బుద్దా మురళి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సమాచార హక్కు కమిషన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి దాఖలు చేసిన 545 దరఖాస్తులకు సంబంధించి ఒకే ఉత్తర్వుతో వాటికి మోక్షం కల్పించింది. శ్రీనివాస్‌రెడ్డి అనే న్యాయవాది రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి బడ్జెట్‌లో వివిధ పద్దుల కింద ఎంతెంత బడ్జెట్‌ కేటాయించారు..ఎంత ఖర్చు చేశా రో వివరాలు ఇవ్వాలంటూ ఒక్కో అంశంపై పది పేజీలతో కూడిన మొత్తం 545 దరఖాస్తులను ఆర్‌టీఐ చట్టం కింద దాఖలు చేశారు.

సమాచారంకోసం ఒక వ్యక్తి పరి మిత సంఖ్యలోనే దరఖాస్తులు ఇవ్వాలన్న నిబంధనేదీ లేకపోవడంతో న్యాయవాది శ్రీనివాస్‌రెడ్డి వాటిని దాఖలు చేశా రు. ఆర్‌టీఐ చీఫ్‌ కమిషనర్‌ బు ద్దా మురళి ఏడాది కాలంగా ఆ న్యాయవాది ఇచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి.. వాటన్నిటికీ ఒకే ఉత్తర్వునిస్తూ ఆయన కోరిన సమాచారం ఇవ్వాలంటూ ఆర్థిక శాఖను ఆదేశించారు. ఆర్థిక శాఖ అధికారులను ఆర్‌టీఐ కార్యాలయానికి పిలిపించి ఆ దరఖాస్తులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నారు.

వివరాలు బడ్జెట్‌ పుస్తకాల్లో ఉంటాయని అధికారులు సమాచారం ఇవ్వగా.. వ్యయం వివరాలు కూడా ఇవ్వాలని చీఫ్‌ కమిషనర్‌ ఆదేశించారు. కాగా, ఒకే వ్యక్తి వందల సంఖ్యలో దరఖాస్తులు ఇవ్వడం వల్ల అధికారుల సమయం వృథా అవడమేకాక, కమిషన్‌పై భారం పడుతుందని ఈ సందర్భంగా చీఫ్‌ కమిషనర్‌ వ్యాఖ్యానించారు. మరో వ్యక్తి పురపాలక శాఖలో వివరాలు కావాలంటూ రెండు వందలకు పైగా దరఖాస్తులు సమర్పించారని చీఫ్‌ కమిషనర్‌ తెలిపారు. వాటికి కూడా ఒకే ఉత్తర్వు జారీ చేశామని చెప్పారు. 

మరిన్ని వార్తలు