అంతర్జాతీయ విపణిలోకి మహిళా స్టార్టప్‌లు

8 Jan, 2023 02:47 IST|Sakshi

గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలకు వి హబ్‌ కార్యకలాపాల విస్తరణ 

ఇప్పటివరకు 914 స్టార్టప్‌లకు వి హబ్‌ ఊతం 

స్టార్టప్‌ల ప్రోత్సాహానికి రూ.82 కోట్లకు పైగా నిధుల సేకరణ 

నిత్యావసర వస్తువులు, ప్రాసెసింగ్‌ రంగంలో మహిళా స్టార్టప్‌ల ముందంజ 

సాక్షి, హైదరాబాద్‌: మహిళలను వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నాలుగున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వి హబ్‌ (వుమెన్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ హబ్‌) అటు గ్రామీణ, ఇటు అంతర్జాతీయ స్థాయికి కార్యకలాపాలు విస్తరించేలా ద్విముఖ వ్యూహానికి పదును పెడుతోంది. వి హబ్‌లో పురుడు పోసుకుంటున్న మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకునేలా ఓ వైపు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరించేందుకు అవసరమైన ప్రణాళికలను వి హబ్‌ సిద్ధం చేస్తోంది.

ఆర్ధిక, సామాజిక అడ్డంకులను అధిగమించి మహిళలు వాణిజ్యవేత్తలుగా రాణించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు చేయూతను అందిస్తోంది. తమ వద్ద ఉన్న వినూత్న ఆలోచనలు, పరిష్కారాలకు వాణిజ్య రూపం ఇచ్చేందుకు పడుతున్న ఇబ్బందులను మహిళలు అధిగమించేందుకు అవసరమైన సాయాన్ని వి హబ్‌ వివిధ రూపాల్లో అందిస్తోంది. 

మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లు 
మహిళల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనలు, సంక్లిష్ట సమస్యలకు సులభ పరిష్కారం చూపుతూ స్టార్టప్‌ల ద్వారా వాణిజ్యరూపంలో ఊతమిచ్చేందుకు 2018 మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వి హబ్‌ ఏర్పాటు చేసింది. వి హబ్‌లో ప్రస్తుతం మహిళల సారథ్యంలోని 84 స్టార్టప్‌లు ఇంక్యుబేట్‌ అవుతుండగా, వి హబ్‌ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 914 మహిళా స్టార్టప్‌లు ఇక్కడ ఏర్పాటయ్యాయి.

వి హబ్‌లో ఇంక్యుబేట్‌ అవుతున్న స్టార్టప్‌లలో ఎక్కువగా నిత్యావసర వస్తువులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలకు చెందినవి కాగా, 25 శాతం చేనేత, వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ రంగాలు, 13 శాతం ఆరోగ్య, లైఫ్‌సైన్సెస్‌ రంగాలు కాగా మిగతావి ఇతర రంగాలకు చెందినవి. స్టార్టప్‌లు తమ ఆలోచనలకు పదును పెట్టుకునేందుకు అవసరమైన సాయంతో పాటు సాంకేతిక సాయం అందించే మెంటార్లను (మార్గదర్శకులు) కూడా వి హబ్‌ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటి వరకు బ్యాంకు లింకేజీలు, ఈక్విటీ ఫండింగ్, స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ స్కీమ్‌ తదితరాల ద్వారా మహిళా స్టార్టప్‌లకు వి హబ్‌ రూ.83 కోట్ల మేర నిధులు సమకూర్చింది. 

అటు వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌తో ఒప్పందం ఇటు మారుమూల ప్రాంతాల్లో విస్తరణ 
మహిళా స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించడం ద్వారా మెరుగైన వాణిజ్య అవకాశాలను పొందేందుకు వీలుగా వి హబ్‌ ఇటీవల వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. పలు అంతర్జాతీయ కంపెనీలతోనూ మహిళా స్టార్టప్‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక హైదరాబాద్‌కే కార్యకలాపాలను పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలపైనా వి హబ్‌ దృష్టి సారించనుంది. సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు కొన్ని గిరిజన ప్రాంతాల్లోనూ స్టార్టప్‌ సంస్కృతిపై అవగాహన కల్పించాలని వి హబ్‌ నిర్ణయించింది. 

మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం
రాష్ట్రంలో మహిళల సారథ్యంలోని స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా మహిళా వాణిజ్యవేత్తలను తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. వినూత్న ఆలోచనలు కలిగిన మహిళలను గుర్తించడం, వారి ఆలోచనలకు స్టార్టప్‌ల ద్వారా వాణిజ్య రూపం ఇవ్వడం, వారికి అవ సరమైన పెట్టుబడి, సాంకేతిక, వాణిజ్య సల హాలు, మార్గదర్శనం ఇవ్వడంలో వి హబ్‌ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ స్టార్టప్‌లు స్థానిక ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 
– దీప్తి రావుల, సీఈఓ, వి హబ్‌ 

గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని.. ఇప్పుడు వాణిజ్యవేత్తను 
గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసిన నేను వి హబ్‌ ప్రోత్సాహంతో వాణిజ్యవేత్తగా మారాను. స్టార్టప్‌ ద్వారా బిజినెస్‌ ప్రారంభించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు, బిజినెస్‌ ఐడియాలు, మార్కెటింగ్‌ నెట్‌వర్క్‌ తదితరాల్లో ఇక్కడ మార్గదర్శకత్వం లభించింది. ప్రస్తుతం కంప్యూటర్‌ ఎంబ్రాయిడరీ మెషీన్ల వ్యాపారం చేస్తున్నా. ఎంబ్రాయిడరీ స్టూడియో నుంచి మొదలైన నా ఆలోచన ప్రస్తుతం ఎంబ్రాయిడరీ మెషీన్ల దాకా విస్తరించింది. ప్రస్తుతం రూ.1.2 కోట్ల వార్షిక టర్నోవర్‌తో నా వ్యాపారం సాగుతోంది.      
– భవ్య గుమ్మడి 

మరిన్ని వార్తలు