వలస కార్మికులకు కువైట్‌ సర్కార్‌ ఊరట

9 Oct, 2021 19:50 IST|Sakshi

60 ఏళ్లు పైబడిన వారిని స్వదేశాలకు పంపించే నిబంధన ఎత్తివేత

మళ్లీ కొత్త ఉద్యోగాలకు ఆహ్వానం

మోర్తాడ్‌ (బాల్కొండ): తమ దేశంలో ఉన్న విదేశీ వలస కార్మికుల సంఖ్యను తగ్గించుకోవడానికి 60 ఏళ్ల వయసు పైబడిన వారిని స్వదేశాలకు పంపిన కువైట్‌ ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేసింది. వలస కార్మికులను బలవంతంగా పంపించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో 60 ఏళ్ల పైబడిన వారిని మళ్లీ విధులలో కొనసాగించాలని కువైట్‌ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో తమ దేశ పౌరులకు ఉపాధి కల్పించే బాధ్యత కువైట్‌ ప్రభుత్వంపై పడటంతో 2020 డిసెంబర్‌లో విదేశీ వలస కార్మికులను తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకుంది. 

ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో వ్యాపార, వాణిజ్య రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. కువైట్‌ పౌరులలో ఎక్కువ మందికి వ్యాపార, సాంకేతిక రంగాల్లో అనుభవం లేక పోవడం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వ్యాపారాలకు ప్రతిబంధకంగా మారింది. దీంతో వృత్తి నైపుణ్యం ఉన్న విదేశీ వలస కార్మికులను వయసుతో సంబంధం లేకుండా పనుల్లోకి తీసుకోవాలని కువైట్‌ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 

2021 జనవరి 1 నాటికి 60 ఏళ్లు నిండిన వలస కార్మికులను స్వదేశాలకు పంపించగా ఆ తర్వాత కూడా 60 ఏళ్లు నిండిన వారికి వీసాలను రెన్యూవల్‌ చేయలేదు. 60 ఏళ్ల వయసు నిబంధనను ఎత్తివేయడంతో తెలుగు రాష్ట్రాల కార్మికులకు ఊరట లభించింది. కువైట్‌లో ఉపాధి పొందుతున్న తెలుగు రాష్ట్రాల వలస కార్మికుల సంఖ్య దాదాపు 3.5 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా కరోనాతో నిలిపివేసిన కువైట్‌ ప్రభుత్వం నిలిపివేసిన వీసాలను ఇప్పుడు జారీచేయడానికి ఆమోదం తెలిపింది. (చదవండి: ఆ విషయంలో దేశానికే ఆదర్శం.. హైదరాబాద్‌)

మరిన్ని వార్తలు