ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు!

19 Jun, 2022 01:57 IST|Sakshi
భద్రతా సిబ్బంది పహారాలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌

సికింద్రాబాద్‌ ఘటనలోని ఆర్మీ అభ్యర్థుల భవిత బుగ్గి 

ఐపీసీ, రైల్వే యాక్ట్, పీడీపీపీఏల్లోని 15 సెక్షన్‌ కింద కేసు 

భవిష్యత్తులో ప్రభుత్వ, కొన్ని ప్రైవేట్‌ ఉద్యోగాలకు నో చాన్స్‌ 

అగ్నిపథ్‌ రద్దయినా కేసు ఉపసంహరణకు అవకాశాలు లేనట్లే

నేరం నిరూపణ అయితే గరిష్టంగా ఉరిశిక్ష విధించే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసానికి సంబంధించి ఒకసారి కేసు నమోదైతే, ఇక ఉపసంహరణ ప్రక్రియ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తీవ్రమైన రైల్వే యాక్ట్‌లోని సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేరం నిరూపణ అయితే గరిష్టంగా మరణశిక్ష విధించే ఆస్కారమూ ఉంది. సికింద్రాబాద్‌ ఘటనలో కొందరే విధ్వంసానికి పాల్పడినప్పటికీ ఆ సమయంలో అక్కడున్న అందరూ నిందితులుగా మారే అవకాశాలు ఉన్నాయి.

ఐపీసీ, రైల్వే యాక్ట్, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం(పీడీపీపీఏ)లోని సెక్షన్లలో నమోదైన ఈ కేసు కారణంగా నిందితులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు. హత్యాయత్నం, విధ్వంసం, దాడులుసహా మూడు చట్టాల్లోని 15 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఏపీలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం తదితరాల్లోనూ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి.

అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ, ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలోనూ ఆ కేసులను ఉపసంహరించారు. దీన్నే విత్‌డ్రాల్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌గా పిలుస్తారు. అయితే రైల్వే యాక్ట్‌ కింద నమోదైన కేసుల్లో ఈ వెసులుబాటు ఉండదు. వీటి విచారణ సైతం ప్రత్యేక రైల్వే కోర్టులో జరుగుతుంది. ఈ కారణంగానే ఇదివరకు రైల్‌రోకో చేసిన రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంకా ఆ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.

సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్టులో కేసు వీగినా ఇదే పరిస్థితి ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క మల్టీ నేషనల్‌ కంపెనీల సహా అనేక ప్రైవేట్‌ సంస్థలు సైతం ఇటీవల ఉద్యోగం ఇచ్చే ముందు పోలీసు క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ కచ్చితంగా అడుగుతున్నాయి. ఈ కేసు నేపథ్యంలో నిందితులుగా ఉన్న ఆందోళనకారులకు పోలీసు విభాగం క్లియరెన్స్‌ సర్టిఫకెట్లు జారీ చేయదని, పాస్‌పోర్టులు జారీ కావని, కొన్ని దేశాలకు ప్రత్యేక వీసాలు కూడా పొందడం కష్టసాధ్యమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు బ్యాక్‌గ్రౌండ్‌ వెరిఫికేషన్‌ జరుగుతుంది. అలాంటి సందర్భంలోనూ ఈ కేసు అడ్డంకిగా మారే అవకాశం ఉంది.  

ఈ కేసులోని సెక్షన్లు, ఆరోపణలు, నిరూపణ అయితే గరిష్ట శిక్షలు ఇలా 
► ఐపీసీలోని 143: చట్ట విరుద్ధంగా ఓ ప్రాంతంలో గుమిగూడటం, ఆరు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ 
► 147: అల్లర్లు చేయడం, రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ 
► 324: మారణాయుధాలతో గాయపరచడం, మూడేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ 
► 307: హత్యాయత్నం, పదేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ 
► 435: అగ్ని లేదా పేలుడు పదార్థం విని యోగించి విధ్వంసం సృష్టించడం, ఏ డేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ 
► 427: రూ.50 అంతకంటే ఎక్కువ విలువైన వస్తువును ధ్వంసం చేయడం, రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ 
► 448: అనుమతి లేకుండా ఓ ప్రాంతంలోకి ప్రవేశించడం, ఏడాది జైలు లేదా జరిమానా లేదా రెండూ 
► 336: ఎదుటి వారికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న పని చేయడం, మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ 
► 332: విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుని గాయపరచడం, మూడేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ 
► 341: నిర్భంధించడం, నెల రోజుల జైలు లేదా జరిమానా లేదా రెండూ 
► 149: గుంపుగా ఆందోళన చేసినప్పుడు అందులోని ప్రతి ఒక్కరూ నేరానికి బాధ్యులే 

ఇండియన్‌ రైల్వే యాక్ట్‌
►సెక్షన్‌ 150: తాము చేస్తున్న పని వల్ల ఎదుటి వారి ప్రాణాలకు హాని ఉందని తెలిసీ చేయడం, మరణ శిక్ష లేదా జీవిత ఖైదు 
►151: రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం, ఐదేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ 
►152: రైళ్లపై రాళ్లు విసరడం, కర్రలతో దాడి చేయడం, పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు 

పీడీపీపీ యాక్ట్‌: 
► సెక్షన్‌ 3: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, 6 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు లేదా జరిమానా లేదా రెండూ  

మరిన్ని వార్తలు