ప్రేమే నేరమా..!

26 Sep, 2020 06:07 IST|Sakshi

పరువు హత్యలు మానవతకే మచ్చ 

సమాజంలో మార్పు రావాలి.. 

నేరస్తులను కఠినంగా శిక్షించాలి.. 

సాక్షి, సిటీబ్యూరో: మరోసారి పరువు పడగ విప్పింది.. ఉన్మాదమై బుసకొట్టింది.. నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. ఆధునిక శాస్త్ర సాంకేతిక ప్రపంచం గుప్పెట్లోకి వచ్చినా.. మానవ సంబంధాల్లోని బూజు మాత్రం తొలగిపోలేదు. మనిషితనం అదేపనిగా మాయమవుతూనే ఉంది. గచ్చిబౌలికి చెందిన హేమంత్‌ హత్య మరోసారి అత్యంత అమానవీయమైన కుల ఉన్మాదాన్ని చాటుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు అవంతి, హేమంత్‌లు. మైనారిటీ తీరి మేజర్‌లయ్యారు. కులాలు వేరైనా మనస్సులు కలిశాయి. పెళ్లితో ఒక్కటయ్యారు. అవంతి కుటుంబానికి ఇది మింగుడుపడలేదు.

హేమంత్‌ను దారుణంగా హతమార్చారు. మిర్యాలగూడ తరహాలో నగరంలో చోటుచేసుకున్న ఈ పరువు హత్య మరోసారి చర్చనీయాంశమైంది. కుల, మతాంతర వివాహాలకు రక్షణ లేకపోవడం వల్లనే ఇలాంటి హత్యలు చోటుచేసుకుంటున్నట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. నేరస్తులను కఠినంగా శిక్షించకపోవడం వల్లనే నేరాలు పునరావృతమవుతున్నాయని  అభిప్రాయపడ్డారు.  మేధావులు, సామాజిక కార్యకర్తలు, మనస్తత్వ నిపుణులు హేమంత్‌ హత్యను తీవ్రంగా ఖండించారు. 

ప్రేక్షకపాత్ర మంచిది కాదు
వరుసగా పరువు హత్యలు జరుగుతున్నాయి. కానీ సమాజంలో పలుకుబడి గల వ్యక్తులు, రాజకీయ పార్టీలు, ప్రముఖులు స్పందించడం లేదు. తప్పును తప్పు అని చెప్పకపోవడం కూడా నేరమే. పరువు హత్యలను కొంతమంది మనోభావాలకు ముడిపెట్టి ఇలా ప్రేక్షకపాత్ర వహించడం వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. సాధారణంగా అగ్రకులాలకు చెందిన వారి పిల్లలు, దళితుల పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అగ్రకులాల మధ్య కూడా కుల ఉన్మాదం పెరిగింది.  (మరో ‘పరువు’ హత్య)

ఒక కులాన్ని మరో కులం సహించలేని దారుణమైన కుల ఆధిపత్యం ఇది. చాలా దారుణం.  ఇలాంటి హత్యల వల్ల మానవత్వం నశిస్తుంది. నేరస్తులకు సకాలంలో శిక్షలు పడకపోవడం వల్ల కూడా నేరాలు పెరుగుతున్నాయి. సమాజంలో చైతన్యం వచ్చినప్పుడే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్టపడుతుంది. ప్రేమ పెళ్లిళ్లలో ఇష్టమైతే తల్లిదండ్రులు ఆ జంటను ఆశీర్వదించాలి. లేదా వారి ఇష్టానికి వారిని వదిలేయాలి, కానీ ఇలా హత్యలకు పాల్పడటం దారుణం.  – ప్రొఫెసర్‌ నాగేశ్వర్, ప్రముఖ సామాజిక విశ్లేషకులు 

ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు రావాలి
కులాంతర, మతాంతర వివాహాలకు సంబంధించిన స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌ బలంగా లేకపోవడం వల్లనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. 1954లో తెచ్చిన ఈ చట్టం మొక్కుబడిగా కొద్దిపాటి నగదు ప్రోత్సాహం  ఇవ్వడానికే పరిమితమైంది. కానీ సరైన రక్షణ కల్పించలేకపోతోంది. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలకు చట్టబద్ధమైన రక్షణ, సామాజిక భద్రత ఎంతో అవసరం. అప్పుడు మాత్రమే ఇలాంటి హత్యలు జరగవు.

‘ఆడ పిల్లలు కుటుంబ గౌరవానికి ప్రతీక’ అనే పాతకాలం నాటి భావాల్లో కూడా మార్పు రావాలి. ఆడైనా, మగైనా సమానమే. కుల, మతాలకు అతీతంగా ప్రేమించి పెళ్లి చేసుకొనేవారు కూడా సాధ్యమైనంత వరకు ఇరువైపులా తల్లిదండ్రులను, కుటుంబాలను ఒప్పించడం మంచిది. పోలీసుల ద్వారా, ఇతరత్రా సంస్థల ద్వారానైనా సరే ఒప్పించడం ఒత్తిడి తెచ్చి ఒప్పించడం వల్ల ఇలాంటి హత్యలను ముందస్తుగానే అడ్డుకున్నట్లవుతుంది. – మమత రఘువీర్, సామాజిక కార్యకర్త 

హత్యలతో పంతం నెగ్గించుకోవడం దారుణం
అప్పటి వరకు మనిషిలో నిద్రాణంగా దాగి ఉన్న నేర స్వభావం తన అధిపత్యానికి విరుద్దమైన ఘటనలు జరిగినప్పుడు ఇలా బయటకొస్తుంది. ఈ రోజుల్లో కూడా కులపిచ్చి హత్యలకు పాల్పడే స్థాయిలో ఉండటం చాలా దారుణం. సాధారణంగా కుటుంబంలో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమవుతాయి. కేరింగ్‌ అండ్‌ షేరింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌ చాలా అవసరం.  కేవలం ఒకరిద్దరు వ్యక్తులు తమ పంతాన్ని నెగ్గించుకోవడం, తాము చెప్పిందే చెల్లుబాటుకావాలనుకోవడం హత్యల వరకు దారితీయడం శోచనీయమే. ఇలాంటి దారుణాలు మరోసారి పునరావృతం కాకుండా సమాజం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.  – డాక్టర్‌ రాధికా ఆచార్య, మనస్తత్వ నిపుణులు  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా