కోవిడ్‌ బాధితులు: మనసు బరువాయే.. కునుకు రాదాయే..

19 Apr, 2021 14:25 IST|Sakshi

పోస్ట్‌ కోవిడ్‌ బాధితుల్లో భయం,ఆందోళన, కుంగుబాటు

నిద్రలేమి, పీడకలలు, ఆత్మహత్యాభావన

శారీరక బలహీనత, న్యూరోపతిక్‌ సమస్యలు

సాక్షి, సిటీబ్యూరో: ‘ఎవరో తరుముతున్నట్లు అనిపిస్తుంది. ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది. రాత్రిపూట కళ్లు మూసుకుంటే చాలు పీడకలలు వచ్చేస్తున్నాయి. భయంతో నిద్ర పట్టడం లేదు..’ కొద్ది రోజుల క్రితం కోవిడ్‌ నుంచి బయటపడిన ఒక మహిళ భయాందోళన ఇది. ‘తీవ్రమైన అలసట, నిస్సత్తువ, తలనొప్పి, మనస్సంతా భారంగా దిగులుగా ఉంది.’ కోవిడ్‌ నుంచి బయటపడిన హిమాయత్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి ఆవేదన ఇది. ఇటీవల కాలంలో ఈ తరహా పోస్టు కోవిడ్‌ సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు మానసిక వైద్య నిపుణులు, న్యూరోసైకియాట్రిస్టులు పేర్కొంటున్నారు. మొదటి దశ కోవిడ్‌ బాధితుల్లో ఎక్కువ శాతం శారీరక బాధలు కనిపించగా ప్రస్తుతం రెండో దశ బాధితుల్లో మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

మహమ్మారి భారినుంచి బయటపడినా చాలామందిని దాని తాలూకు నీలినీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు వైరస్‌ తగ్గుముఖం పట్టింది. ఆ సమయంలో కేసుల తాకిడి తక్కువగానే ఉంది. డిసెంబర్‌లో తిరిగి కోవిడ్‌ పాజిటవ్‌ కేసులు క్రమంగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కేసుల సంఖ్య పెరిగింది. మార్చి నుంచి రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఉధృతి తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వైద్యసేవలు లభించి వ్యాధి నుంచి బయటపడినప్పటికీ భయాందోళనలు, కుంగుబాటు, మానసిక వ్యాకులత, నిద్రలేమి వంటి సమస్యలతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని ప్రముఖ న్యూరో ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎన్‌.శ్వేతారెడ్డి తెలిపారు. 

గులియన్‌ బ్యారో సిండ్రోమ్‌..
కొంతమందిలో చాలా అరుదైన గులియన్‌ బ్యారో సిండ్రోమ్‌ లక్షణాలు కూడా కనిపించినట్లు ఆమె చెప్పారు. రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపే ఈ జబ్బు వల్ల శారీరకరంగా బలహీనంగా మారుతారు. బరువు తగ్గిపోవడం, కూర్చుంటే లేవలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. దీని ప్రభావం కొద్ది రోజులే ఉంటుంది. మరోవైపు 60 ఏళ్లు దాటిన వారిలో న్యూరోపతి లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. మోకాళ్ల నుంచి పాదాల వరకు నొప్పులు, అరికాళ్ల మంటలు వంటి సమస్యలతో  బాధపడుతున్నారు. చాలా మందిని తిమ్మిర్లు వేధిస్తున్నాయి. మెగ్రెయిన్‌ను తలపించే విధంగా తలనొప్పి ఉంటుంది. గుండెదడ వంటి సమస్యలతో కొందరు బాధపడుతున్నారు. నూటికి ఒకరిద్దరిలో ఆత్మహత్యాభావన కూడా కనిపిస్తుందని న్యూరోసైకియాట్రిక్‌ వైద్య నిపుణులు చెబుతున్నారు. 

చదవండి: ముంబై నుంచి తెలంగాణ: ఈ జర్నీ చాలా కాస్ట్‌లీ గురూ! 
కరోనా ప్రతాపం: ఆట పాటలకు టాటా!

మరిన్ని వార్తలు