Covid 19: మృతదేహాల ద్వారా కోవిడ్‌ వ్యాప్తి తక్కువే! 

10 May, 2021 14:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మనిషి శరీరంలో 4 నుంచి 6  గంటల వరకే వైరస్‌ జీవిస్తుంది

బాడీని నేరుగా తాకకుండా..  కోవిడ్‌ నిబంధనలు పాటిస్తే చాలు 

సంప్రదాయబద్ధంగా దహన  సంస్కారాలు చేసుకోవచ్చు 

దగ్గరగా ఉండేవారు గ్లౌవ్స్, మాస్క్,  పీపీఈ కిట్లు వాడితే సరిపోతుంది 

సాక్షి, హైదరాబాద్‌:  కరోనా కేసులు భారీగా నమోదవుతున్న కొద్దీ మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఆ మృతదేహాలకు అంత్యక్రియల విషయంలో ఆందోళన కనిపిస్తోంది. మృతదేహాల దగ్గరికి వచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా సాహసించడం లేదు. కొందరు ఆస్పత్రుల్లోనే మృతదేహాలను వదిలేసి వెళుతున్నారు. అలాంటి వాటికి మున్సిపాలిటీలే అనాథ శవాల జాబితాలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాయి. ఇక మృతదేహాలను తీసుకెళ్లిన వారు కూడా సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించడం లేదు. కరోనా భయం నేపథ్యంలో పాడె మోయడానికీ ఎవరూ ముందుకు రాని పరిస్థితుల్లో ట్రాక్టర్‌ ట్రాలీ/ జేసీబీలతో శ్మశానాలకు తీసుకెళ్తున్నారు. కడసారి చూడటానికి కూడా దగ్గరికి రాకపోవడం, మృతదేహాలను నేరుగా చితిమీదికి చేర్చడమో, గుంతలో పడేయడమో చేస్తుండటం హృదయాలను ద్రవింపజేస్తోంది. నిజానికి కోవిడ్‌ మృతదేహాల విషయంలో ఇంత భయం అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించవచ్చని సూచిస్తున్నారు. 

లక్షణాలు లేని వారి నుంచే.. 
ప్రాణం పోయిన తర్వాత శరీరంలో వైరస్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పటికే బాడీలోని ప్లూయిడ్స్‌లో వైరస్‌ ఉన్నా.. దానికది ఇతర ప్రదేశాలకు వ్యాపించలేదు. ఆ మృతదేహాన్ని నేరుగా తాకడం, పైన పడి ఏడవడం, చనిపోయినవారి తల, ఇతర శరీర భాగాలను ఒళ్లో పెట్టుకుని ఏడవడం వంటివాటి వల్ల మాత్రమే వైరస్‌ విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనా మృతదేహాన్ని ఉంచిన జిప్‌బ్యాగ్‌ను తెరవకుండా ఉంటే వైరస్‌ సోకే అవకాశం లేనట్టేనని అంటున్నారు. మృతదేహాల నుంచి ఇతరులకు వైరస్‌ సోకిన దాఖలాలు లేవని.. అప్పటికే వైరస్‌ సోకి, లక్షణాలు లేనివారు గుంపుగా ఉన్న జనంలో కలిసి దహన సంస్కారాల్లో పాల్గొనడం వల్లే వైరస్‌ విస్తరిస్తోందని చెప్తున్నారు. పెద్ద సంఖ్యలో ఒకేచోట గుమిగూడటం, తమవారు చనిపోయిన బాధలో ఒకరిపై మరొకరు పడి ఏడవడం, భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు పెట్టుకోకపోవడం వంటివి చేస్తుండటంతో.. ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా మిగతా వారికి అంటుకుంటోందని స్పష్టం చేస్తున్నారు. 

భయంతో మానవత్వాన్ని వదిలేయొద్దు 
ఎవరైనా కోవిడ్‌ రోగి చనిపోతే వైద్యులు ఆస్పత్రిలోనే మృతదేహాన్ని సోడియం హైపోక్లోరైడ్‌తో శుభ్రం చేసి, శానిటైజర్‌లో తడిపిన వస్త్రాన్ని చుట్టి బంధువులకు అప్పగిస్తున్నారు. ప్లూయిడ్స్‌ బయటికి రాకుండా మృతదేహాన్ని జిప్‌లాక్‌ బ్యాగ్‌లో కేవలం ముఖం మాత్రమే కనిపించేలా ప్యాక్‌ చేసి ఇస్తున్నారు. ఇలాంటి మృతదేహాలకు గౌరవప్రదంగా దహన సంస్కారాలు చేయవచ్చు. కానీ చాలా మంది వైరస్‌కు భయపడి మృతదేహం దగ్గరికే రావడం లేదు. ఆస్పత్రుల్లోనే అనాథ శవాల్లా వదిలివెళ్లిపోతున్నారు. తీసుకెళ్లినా మరణించిన వారి ఆత్మ ఘోషించేలా వ్యవహరిస్తున్నారు. కనీస మానవత్వం కూడా లేకుండా ట్రాక్టర్‌/ జేసీబీతో మృతదేహాన్ని తీసుకెళ్లి గుంతలో పడేస్తున్నారు. ఇంత ఆందోళన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు పాటిస్తే చాలు. 
 – డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎంపీ 

జిప్‌లాక్‌ బ్యాగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దు 
కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దహన సంస్కారాలు చేయవచ్చు. సోడియం హైపోక్లోరైడ్‌ సొల్యూషన్‌తో మృతదేహాన్ని శుభ్రం చేయాలి. జిప్‌లాక్‌ బ్యాగ్‌లో పెట్టి జాగ్రత్తగా తరలించాలి. కుటుంబ సభ్యులు పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌవ్స్‌ ధరించి పాడె మోయవచ్చు. జిప్‌లాక్‌ బ్యాగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో తెరవొద్దు. చనిపోయినవారి నోట్లో పాలు పోయడం, అన్నం పెట్టడం, పగడం పెట్టడం వంటివి చేస్తుంటారు. అవి వద్దు. దహన సంస్కారాల్లో 20 మంది కంటే ఎక్కువ పాల్గొనకూడదు. మృతదేహానికి మూడు నుంచి ఆరు మీటర్ల దూరంలో ఉండి నివాళి అర్పించవచ్చు. శుభకార్యాలకు వెళ్లినా, వెళ్లక పోయినా నష్టం లేదు కానీ కోవిడ్‌ బాధితులను కనీసం ఫోన్‌లోనైనా పరామర్శించండి. 
– డాక్టర్‌ శ్రీహర్ష, సర్వైలెన్స్‌ ఆఫీసర్, హైదరాబాద్‌ జిల్లా 

శరీరాన్ని నేరుగా తాకొద్దు.. 
కోవిడ్‌ పేషెంట్లకు చికిత్సలో భాగంగా రక్తం గడ్డకట్టకుండా మందులు ఇస్తున్నాం. చనిపోయిన తర్వాత కూడా రక్తం గడ్డకట్టకపోవడంతో ముక్కు, చెవులు, ఇతర రంధ్రాల నుంచి రక్తం బయటికి కారుతుంది. సోడియం హైపోక్లోరైడ్‌తో మృతదేహాన్ని శుభ్రపర్చినా.. తర్వాత శరీరంలోని ఫ్లూయిడ్స్‌ బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మృతదేహాన్ని నేరుగా తాకవద్దు. మృతదేహాన్ని ప్యాక్‌ చేసిన బ్యాగ్‌ను తెరవొద్దు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించవచ్చు. మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లి, ఊరేగింపులు జరపకుండా.. ఆస్పత్రి నుంచి నేరుగా శ్మశానవాటికకు తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు పూర్తి చేయడం మంచిది. అంతేగాక ఈ సమయంలో ఎక్కువ మంది గుమిగూడవద్దు. అలా చేస్తే ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ విస్తరించే ప్రమాదం ఉంటుంది. 
– డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, నోడల్‌ ఆఫీసర్, గాంధీ కోవిడ్‌ సెంటర్‌  

చదవండి: Zero Covid Cases: ఆ ఊరికి కరోనా రాలే..!

మరిన్ని వార్తలు