మళ్లీ ఎక్స్‌ప్రెస్‌ల పరుగులు

18 Jun, 2021 06:58 IST|Sakshi

కోవిడ్‌ తగ్గుముఖంతో స్టేషన్లకు ప్రయాణికులు

 క్రమంగా సర్వీసులు పెంచిన రైల్వే

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ రెండో వేవ్‌లో ప్రయాణికుల రద్దీ లేక నిలిచిపోయిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. గత ఏడాది కోవిడ్‌ మొదలైన తర్వాత లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా కొంతకాలం అన్ని రైళ్లను నిలిపేసిన విషయం తెలిసిందే. మొదట్లో సరుకు రవాణా రైళ్లను మాత్రమే నడిపారు. అన్‌లాక్‌ మొదలయ్యాక స్పెషల్‌ సర్వీసులుగా కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించి.. ఏప్రిల్‌ ఒకటి నాటికి 90 శాతం సర్వీసులు పట్టాలెక్కించారు. కానీ రెండో వేవ్‌తో రైళ్లకు మళ్లీ బ్రేకులు పడ్డాయి. రైళ్లకు లాక్‌డౌన్‌ నిబంధనలను అమలు చేయకున్నా.. ప్రజలే భయాందోళనతో ప్రయాణాలను తగ్గించేశారు.

ఓ దశలో ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం కంటే తక్కువకు పడిపోవడంతో.. రైల్వేబోర్డు క్రమంగా రైళ్లను తగ్గిస్తూ వచ్చింది. జూన్‌ మొదటివారం నాటికి నామమాత్ర సంఖ్యలో రైళ్లు నడిచాయి. ప్రస్తుతం కోవిడ్‌ కేసులు తగ్గడం, టీకాలు వేయించుకోవటంతో రైళ్ల ఆక్యుపెన్సీ పెరగటం మొదలైంది. దీంతో వారం రోజులుగా రైళ్ల సంఖ్య పెంచుతూ వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం తిరిగే అన్ని ప్రధాన రైళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. గురువారం నాటికి మొత్తం 126 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇందులో దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించినవి 87 కాగా, మిగతావి ఇతర జోన్ల నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించేవి. ప్రస్తుతం రైళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి చేరుకుందని.. ఈ నెలాఖరు నాటికి 80 శాతానికి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. 

జూలైలో ప్యాసింజర్, ఎంఎంటీఎస్‌ సేవలు! 
గతేడాది మార్చిలో లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పుడు నిలిచిపోయిన ఎంఎంటీఎస్, ప్యాసింజర్‌ రైలు సేవలు ఇప్పటివరకు మొదలుకాలేదు. ఇంత సుదీర్ఘకాలం అవి నిలిచిపోవటం రైల్వే చరిత్రలోనే తొలిసారి. ప్రయాణికుల సంఖ్యను నియంత్రించే అవకాశం లేకపోవటం, కోవిడ్‌ నిబంధనల అమలు సాధ్యం కాదన్న ఉద్దేశంతో ప్యాసింజర్, ఎంఎంటీఎస్‌ రైళ్లను పునరుద్ధరించలేదు. రెండో దశ తగ్గుముఖం పడుతున్నందున జూలైలో వాటిని తిరిగి ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఎంఎంటీఎస్‌ సేవలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతి ఏదీ రాలేదని రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.   

మరిన్ని వార్తలు