రెండు బైపాస్‌లు.. 14 అండర్‌పాస్‌లు..

19 Aug, 2021 10:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో మరో జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది. ఇది నాలుగు వరుసల జాతీయ రహదారే అయినప్పటికీ, మధ్యలో రోడ్డు మీదుగా ఇతర చిన్న రహదారుల నుంచి వచ్చే వాహనాలు వెళ్లకుండా ఎక్కడికక్కడ అండర్‌ పాస్‌లను నిర్మిస్తూ ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో నిర్మించనున్నారు. హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారికి మార్గం సుగమమైంది. మరో రెండు నెలల్లో టెండర్ల కసరత్తు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు. ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలంలో ఇది అందుబాటులోకి రానుంది. నగర శివారులోని అప్పా జంక్షన్‌ నుంచి వికారాబాద్‌ దారిలోని మన్నెగూడ కూడలి వరకు ఈ నాలుగు వరుసల విశాలమైన రోడ్డు అందుబాటులోకి వస్తుంది.

మన్నెగూడ నుంచి పరిగి మీదుగా కర్ణాటకలోని బీజాపూర్‌ వరకు కొనసాగుతుంది. మన్నెగూడ కూడలి వరకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నాలుగు వరుసలుగా దీన్ని నిర్మించనుండగా, అక్కడి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డును వెడల్పు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం పర్యవేక్షిస్తోంది. ఈ విభాగం ఇప్పటికే తన పరిధిలోని రోడ్డును 30 మీటర్లకు విస్తరించింది. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ తన అ«దీనంలోని రోడ్డును 4 వరుసలుగా విస్తరించేందుకు సమాయత్తమైంది. 

60 మీటర్ల వెడల్పుతో.. 
గతంలో రాష్ట్ర రహదారిగా ఉన్న బీజాపూర్‌ రోడ్డును 163వ నంబర్‌ జాతీయ రహదారిగా కేంద్రం ప్రక టించింది. ఇప్పుడు దాన్ని భారత్‌మాల పరియోజన పథకంలో చేర్చి ఇటీవలే ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించింది. అప్పా కూడలి వరకు విశాలంగానే ఉన్న రోడ్డు ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో 25 మీటర్లు, కొన్ని చోట్ల 30 మీటర్లుగా ఉంది. ఇప్పుడు దాన్ని 60 మీటర్లకు విస్తరించనున్నారు. ఇందులో ప్రధాన రోడ్డు 45 మీటర్లుగా ఉండనుంది. మధ్యలో నాలుగున్నర మీటర్ల సెంట్రల్‌ మీడియన్‌ ఉంటుంది. ప్ర ధాన క్యారేజ్‌ వే 30 మీటర్లుగా ఉంటుంది. దీనికి చివరలో వాలు, ఆ తర్వాత డ్రెయిన్‌ ఇలా మొత్తం 45 మీటర్ల వెడల్పుతో రోడ్డు ఉంటుంది. ఇక రెండు వైపులా విద్యుత్తు స్తంభాలు, చెట్లు, ఇతర అవసరాల కోసం 15 మీటర్ల (రెండువైపులా కలిపి) స్థలం ఉంటుంది. 

పెరిగిన ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని.. 
తాండూరు, వికారాబాద్, పరిగి, బీదర్‌ సహా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ఈ రోడ్డునే వినియోగిస్తుండటంతో కొంతకాలంగా ట్రాఫిక్‌ రద్దీ బాగా పెరిగింది. గతంలో శివారు ప్రాంతంగా ఉండి అంతగా రద్దీలేని మొయినాబాద్‌ ప్రాంతం ఇప్పుడు కిక్కిరిసిపోతోంది. మొయినాబాద్‌ నుంచి వికారాబాద్‌ వరకు ఫామ్‌హౌస్‌లు బాగా పెరిగాయి. వాటికి నిత్యం వచి్చపోయే వారితో రద్దీ మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో దీన్ని విస్తరించాలన్న డిమాండ్‌ చాలా కాలం నుంచి ఉంది. కాగా, అప్పా కూడలి నుంచి 46.405 కి.మీ. దూరం వరకు, అంటే పరిగి కూడలిలో ఉండే మన్నెగూడ వరకు ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పుడు పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మొత్తం 221.90 హెక్టార్ల భూమిని కేంద్ర భూసేకరణ చట్టం కింద సమీకరిస్తున్నారు. 

చిన్న రోడ్లతో ఇబ్బంది లేకుండా.. 
ఈ రోడ్డుపై వాహనాల రద్దీ నేపథ్యంలో ఎక్కడా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ప్లాన్‌ చేశారు. ముఖ్యంగా మధ్యలో ఉండే గ్రామాల వద్ద చిన్న రోడ్ల మీదుగా వచ్చే వాహనాలతో ఇబ్బంది లేకుండా అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. ఆ వాహనాలు ప్రధాన రోడ్డు దిగువగా అండర్‌పాస్‌ల నుంచి ముందుకుసాగుతాయి. చిన్న రోడ్లలోవాహనాల సంఖ్య ఎక్కువగా ఉండే ఆరు చోట్ల భారీ అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. వీటి నుంచి బస్సులు, ట్రక్కులు, కంటెయినర్‌ వాహనాల లాంటి భారీ వాహనాలు వెళ్లిపోతాయి. ఇక 8 చోట్ల చిన్న అండర్‌పాస్‌లు నిర్మిస్తారు. వీటి నుంచి కార్లు లాంటి తక్కువ ఎత్తుండే వాహనాలు వెళ్తాయి. మొయినాబాద్‌ వద్ద 4.35 కి.మీ. మేర, చేవెళ్ల వద్ద 6.36 కి.మీ. మేర రెండు బైపాస్‌ రోడ్లను నిర్మిస్తారు. మన్నెగూడకు సమీపంలోని అంగడి చిట్టంపల్లి వద్ద 12 లేన్ల టోల్‌ప్లాజా నిర్మిస్తారు. ప్రమాదకరంగా మలుపులున్న 0.725 కి.మీ. పరిధిలో రోడ్డును నేరుగా ఉండేలా(రీఅలైన్‌మెంట్‌) మారుస్తారు.

మరిన్ని వార్తలు