150 పోలింగ్‌ స్టేషన్లలో ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ 

30 Sep, 2020 01:58 IST|Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వెల్లడి 

సాక్షి,హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రతి వార్డ్‌లోని ఒక పోలింగ్‌ స్టేషన్‌లో పైలట్‌ ప్రతిపాదికన ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని సుమారు 150 పోలింగ్‌ స్టేషన్లలో అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కమిషనర్‌ సి.పార్థసారథి వెల్లడించారు. పోలింగ్‌ బూత్‌లకు వెళ్లలేని వయోవృద్ధులు, దివ్యాంగులు, పోలింగ్‌ సిబ్బంది తదితరుల కోసం ఈ –ఓటింగ్‌ విధానాన్ని కూడా పైలట్‌ ప్రాతిపదికన ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కమిషన్‌ కార్యాలయంలో మంగళవారం సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులకు టీ–పోల్‌ సాఫ్ట్‌వేర్‌పై శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధునాతన సాంకేతిక వినియోగంతో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.

ఆధునిక సాంకేతికతతో ఓటరు స్లిప్‌లను ,పోలింగ్‌ స్టేషన్లను, నియోజకవర్గం వారీగా పోలింగ్‌ స్టేషన్‌ వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చన్నారు. టీ–పోల్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పార్టీ అభ్యర్థులు ఎన్నికలకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చునని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణ, పోలింగ్‌ పర్సనల్‌ ర్యాండమైజేషన్, ఎన్నికల వ్యయం వివరాల మాడ్యూల్‌ తదితర అంశాలపై అధికారులకు శిక్షణనిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకు జోన్లవారీగా టీ– పోల్,ఎస్‌ఈసీ మాడ్యూల్స్, సంబంధిత యాప్స్‌పై జరిగిన శిక్షణలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా