‘తెలంగాణ ధరణి’ పేరుతో నకిలీ యాప్‌

29 Nov, 2020 05:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్‌

గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారా పోస్ట్‌ చేసిన వైనం

టీఎస్‌టీఎస్‌ ఫిర్యాదుతో కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్‌కు లింక్‌ చేస్తూ నకిలీ యాప్‌ సృష్టించిన ఇద్దరు కర్ణాటక వాసులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరు ఆ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ ద్వారానే పోస్ట్‌ చేసినట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ శనివారం తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన ధరణి వెబ్‌సైట్‌లో భూ రికార్డులు, పహాణీ, ఫామ్‌ బీ–1, తదితరాలు పొందుపరిచింది. సర్కారు ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి మొబైల్‌ యాప్‌ను రూపొందించలేదు. దీన్ని గమనించిన కర్ణాటకలోని బసవకల్యాణం ప్రాంతానికి చెందిన ప్రేమ్‌ మూలే, మహేశ్‌ కుమార్‌ ధండోటే ఓ మొబైల్‌ యాప్‌ రూపొందించారు.

దీనికి ‘ధరణి తెలంగాణ ల్యాండ్‌ రికార్డ్స్‌’అనే పేరు పెట్టారు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను చూసిన అనేక మంది దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. నిందితులు యూట్యూబ్‌ ద్వారా యాప్‌ తయారీ నేర్చుకుని, దానిని క్లిక్‌ చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ధరణి వెబ్‌సైట్‌కు లింకు అయ్యేలా మాత్రమే డిజైన్‌ చేయగలిగారు. అంతకు మించి ఇందులో ఏ వివరాలూ పొందుపరచలేదు. ఈ యాప్‌ విషయం ఇటీవల తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ దృష్టికి వచ్చింది.

దీంతో సంబంధిత అధికారులు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ భద్రంరాజు రమేశ్, ఎస్సై వెంకటేశం దర్యాప్తు చేశారు. గూగుల్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా  ప్రేమ్, మహేశ్‌ ఈ యాప్‌ను రూపొందించినట్లు గుర్తించారు. దీంతో అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం నిందితులను అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు