Hyderabad: చూమంతర్‌ బాబా.. అమావాస్య రోజు పూజలుచేస్తే డబ్బులు రెట్టింపు

14 May, 2022 14:08 IST|Sakshi

సంగారెడ్డిలో డెమో, హైదరాబాద్‌లో మోసం

అత్యాశకుపోయి రూ.12 లక్షలు పోగొట్టుకున్న గంగాధరవాసులు

అప్పు చేసి మరీ బాబాకు డబ్బులు కట్టిన ఓ బాధితుడు

వేములవాడ వ్యాపారులకు రూ.20 లక్షల టోకరా!

వేములవాడ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లిలోనూ బాధితులు

నగదు రెట్టింపు చేస్తానంటూ ఉడాయించిన దొంగబాబా

సాక్షి, కరీంనగర్‌: హైదరాబాద్‌లో ఓ చూమంతర్‌ బాబా ఉన్నాడు. అమావాస్య రోజున పూజలుచేస్తే సంచుల్లో ఉన్న డబ్బుకట్టలు రెట్టింపు అవుతాయి. మీ వద్ద ఎంత ఉంటే అంత తీసుకుని రండి ఓ వ్యక్తి చెప్పిన విషయాన్ని నమ్మిన గంగాధరవాసులు నిలువునా మోసపోయిన వైనమిది. రెట్టింపు కాకపోగా.. ఉన్న డబ్బుల మూటలు మాయంకావడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇందులో ఓ వ్యక్తి అత్యాశకు పోయి.. అప్పు తెచ్చి మరీ డబ్బులు బాబా చేతికి ఇచ్చాడు. తీరా మోసం చేయడంతో అంతా విలపిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరుగుతోన్న ఈ నయా మోసం వివరాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది.

వివరాలివీ..!
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రేమ్‌చంద్‌కు గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన భాషవేని వీరయ్యతో పరిచయం ఉంది. ఇటీవల ప్రేమ్‌చంద్‌ గంగాధరకు వెళ్లాడు. వీరయ్య, అతని మిత్రులు మహేందర్, రాజయ్యను కలిశాడు. తనకు హైదరాబాద్‌లో ఇటీవల ఓ బాబా పరిచయమయ్యాడని.. అతనికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని చెప్పాడు. అతని మాయమంత్రాలతో డబ్బుల మూటలను పదింతలు చేసిస్తాడని నమ్మబలికాడు.

సంగారెడ్డిలో డెమో.. నాంపల్లిలో మోసం..!
►తొలుత వీరెవరూ ప్రేమ్‌చందర్‌ మాటలు నమ్మలేదు. దీంతో వారిని డెమో కోసం సంగారెడ్డి తీసుకెళ్లాడు. అక్కడ పాత మసీదు వద్ద ఉన్న బాబా తనకున్న కనికట్టు విద్యలతో వారిఎదుట డబ్బులు కుప్పలుగా వచ్చేలా చేశాడు. ఇదంతా తన వద్ద స్ప్రేతో చేశానని, మీకు కావాలంటే రూ.12.30 లక్షలు చెల్లించి కొనుక్కోవాలని సూచించాడు. 

►కళ్లముందు కుప్పలుగా డబ్బులు చూసేసరికి ఆ ముగ్గురు అత్యాశకు పోయారు. డబ్బు కోసం ఇళ్లకు పరుగులు తీశారు. మొత్తానికి రూ.12 లక్షలు సేకరించారు. ఇందులో గమ్మత్తయిన విషయం ఏంటంటే.. బాధితుల్లో వీరయ్య వద్ద డబ్బులేదు. నగదు కోసం మహేందర్‌ వద్ద  కొన్ని కాగితాలపై సంతకం పెట్టాడు.

►అంతా కలిసి ఓ రోజు ప్రేంచంద్‌ను తీసుకుని హైదరాబాద్‌ వెళ్లారు. నాంపల్లి స్టేషన్‌ వద్ద ఆ బాబాను కలిశారు. భోజనం చేశాక రూ.12 లక్షలు తీసుకున్న బాబా.. ప్రార్థనలు చేయాలని చెప్పి నగదుతో ఉడాయించాడు. దీంతో బాధితులు ప్రేంచంద్‌ను నిలదీశారు. డబ్బు ఎక్కడికీ పోదని ధైర్యం చెప్పిన ప్రేంచంద్‌ పోయిన డబ్బులో రూ.ఆరు లక్షలు చెల్లిస్తానని నోటు రాసిచ్చాడు.

►బయటపడిందిలా..!
ఒప్పందం ప్రకారం.. తనకు భూమి అమ్ముతానని చెప్పి ఇంతవరకూ రిజిస్ట్రేషన్‌ చేయడం లేదని మహేందర్‌ లాయరు ద్వారా వీరయ్యకు లీగల్‌ నోటీసులు పంపాడు. దీంతో వీరయ్య తాను కేవలం సంతకాలే పెట్టానని, ఏనాడూ భూమిని విక్రయిస్తాననలేదని వాపోతున్నాడు. మరోవైపు తమ మధ్య ఒప్పందం జరిగిందని మహేందర్‌ వాదిస్తున్నాడని సమాచారం. అటు బాబా, ఇటుస్నేహితుడి చేతిలో మోసపోయానని వీరయ్య నెత్తీనోరు బాదుకుంటున్నాడు. తనకు న్యాయం చేయాలని ఇప్పటికే కరీంనగర్‌ సీపీ కార్యాలయం, గంగాధర పోలీసులను ఆశ్రయించానని, మోసం జరిగింది రాజధానిలో కాబట్టి, అక్కడే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారన్నాడు.

ఈ ముగ్గురే కాకుండా.. గంగాధర, నమిలికొండ, వేములవాడకి చెందిన కొందరు వ్యాపారస్తులు కూడా అదే  దొంగబాబాని నమ్మి దాదాపుగా దాదాపు రూ.ఇరవై లక్షలు మోసపోయారని సమాచారం. ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో సదరు బాబా ఏజెంట్లను నియమించుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడని తెలిసింది. 

మరిన్ని వార్తలు