నట్టేట ముంచిన నకిలీ విత్తనం..!

1 Jul, 2021 09:15 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల అగ్రికల్చర్‌: నిషేధిత, నకిలీ పత్తి విత్తనాలు ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలోనే రైతులను నట్టేట ముంచాయి. మొలకెత్తకపోవడంతో వేలాది రూపాయలు  మట్టిపాలయ్యాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే గుర్తింపు లేని విత్తనాలు కొనుగోలు చేసినందుకు కేసు నమోదు చేస్తారనే భయంతో ఆవేదనను దిగమింగుతున్నారు. సీజన్‌ ఆరంభానికి ముందే గుర్తింపు లేని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసులు, అధికారులు ప్రయత్నిస్తున్నా రైతులను చేరాయి. లూజుగా దొరికే పత్తి విత్తనాలు కిలో రూ.2 వేల నుంచి రూ.2,200 చొప్పున కొనుగోలు చేసి విత్తుకున్నారు. ఎవరి వద్ద కొనుగోలు చేశారో వారిని నిలదీస్తే.. డబ్బు ఇవ్వడం కుదరదని, దాచిన విత్తనాలు ఏమైనా ఉంటే మళ్లీ వేసుకోవాలని, వచ్చే ఏడాది మంచి విత్తనాలు ఇస్తామని సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో మళ్లీ దుక్కి దున్ని విత్తనాలు వేసుకుంటున్నారు.  

సీజన్‌ ముందే అందడంతో..
నకిలీ విత్తనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులు గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు, గ్లైపొసెట్‌ గడ్డిమందు పట్టుకొని పీడీ యాక్టు వంటి కేసులు నమోదు చేస్తున్నారు. అక్రమార్కులను  జైలుకు పంపించారు. గతంలో కంటే ఈ ఏడాది 70 శాతం రైతుల దరిచేరకుండా చూసినా మరో 20 నుంచి 30 శాతం వరకు ఫిబ్రవరి, మార్చి నెలలోనే గ్రామాల్లోకి విత్తనాలు చేరాయి. మారుమూల ప్రాంతాల్లో, చేన్లలో కవర్లతో భద్రపరిచారు.

ఎవరికీ అనుమానం రాకుండా గుర్తింపు ఉన్న కంపెనీ పత్తి విత్తనాల ప్యాకెట్లలో కలిపి నకిలీ విత్తనాలు వేసుకున్నారు. జూన్‌ రెండో వారం నుంచి కురిసిన భారీ వర్షాల అనంతరం విత్తుకున్నారు. కొన్ని చోట్ల విత్తనం మొలక శాతం 90 శాతం ఉండగా భీమిని, కన్నెపెల్లి, నెన్నెల, బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట మండలాల్లో కొన్ని చొట్ల 10 నుంచి 30 శాతమే మొలక వచ్చిందని రైతులు వాపోతున్నారు. విత్తనం నాటిన వారం రోజుల్లో మొలక రావాల్సి ఉంటుంది. నేలలో తేమ శాతం బాగానే ఉన్నా 15 రోజుల నుంచి 20 రోజులు గడిచినా మొలక రాలేదని ఆందోళన చెందుతున్నారు.  

దుఃఖాన్ని దిగమింగి..
నెన్నెల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ రైతు 20 ఎకరాల్లో వేసేందుకు ఈ విత్తనాలు రూ.50 వేలకు కొనుగోలు చేశాడు. దుక్కి, విత్తన సాల్లకు రూ.10 వేలు, విత్తేందుకు కూలీలకు రూ.8 వేలతో వెచ్చించాడు. 10 నుంచి 20 శాతం మాత్రమే మొలక రావడంతో రూ.80 వేల వరకు నష్టపోయాడు. బయటకు చెప్పుకోలేక.. బయటకు వస్తే అధికారులకు తెలిసిపోతుందని దుఃఖాన్ని దిగమింగి మరోసారి విత్తనాలు వేసేందుకు దున్ని  సిద్ధపడ్డాడు.  

చదవండి: జీఎస్‌టీతో తగ్గిన పన్నుల భారం 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు