ఉత్తుత్తిగా నకిలీ విత్తనాల కేసులు నమోదు 

8 Jun, 2021 10:05 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: నకిలీ పత్తి విత్తనాలకు కేంద్ర బిందువుగా ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లాలో పోలీస్, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో 15 రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 10,230 కిలోల నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకోగా.. 18 మందిపై 15 కేసులు నమోదయ్యాయి. అయితే పట్టుబడుతున్న వారిపై తూతూమంత్రంగా చీటింగ్‌ కేసులు నమోదు చేస్తున్నారు.

ఇందుకు గద్వాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 3న గద్వాల శివారులోని రమ్య ఇండస్ట్రీస్‌లో టాస్క్‌ఫోర్స్‌ నిర్వహించిన తనిఖీల్లో 72 బ్యాగుల (3434.5 కిలోల) నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. దీనిపై ఎం.విజయభాస్కర్‌రెడ్డిపై కేసు నమోదైంది. అసలు మిల్లు యజమానిని వదిలేసి, ఎవరో వ్యక్తిపై కేసు నమోదు కావడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలొచ్చాయి. ఆ మిల్లును లీజుకిచ్చినట్లు పేపర్లు సృష్టించారనే చర్చ జరిగింది.

దీంతో గద్వాల రూరల్‌ పోలీసులు సోమవారం మిల్లు యజమాని, సీడ్‌ ఆర్గనైజర్, సీడ్‌మెన్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ భీంనగర్‌కు చెందిన బండ్ల రాజశేఖర్‌రెడ్డి (ఏ–1) ధరూర్‌ మండలం, బురెడ్డిపల్లికి చెందిన ఎం.విజయభాస్కర్‌రెడ్డి (ఏ–2)పై కేసు నమోదుచేసి అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్డి ఎదుట హాజరుపరిచారు. ఆపై రిమాండ్‌కు తరలించారు. అయితే పోలీసులు వారిపై చీటింగ్‌ కేసు, విత్తన యాక్ట్‌ కిందే కేసు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్తీ విత్తన తయారీదారులను పీడీ యాక్టు కింద అరెస్ట్‌ చేయాలని సీఎం ఆదేశించినా గద్వాల పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘సాక్షి’ నాడే చెప్పింది.. 
రాష్ట్రంలో కొనసాగుతోన్న నకిలీ విత్తనాల దందాపై ‘సాక్షి’ ప్రధాన సంచికలో కొద్ది రోజుల క్రితం ‘కల్తీ విత్తులతో కొల్లగొడతారు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఎక్కడెక్కడ నకిలీ విత్తనాల దందా జరుగుతోంది?, మాఫియా ఆగడాలు, వారికి అండగా నిలుస్తున్నదెవరు?, నామమాత్రంగా కేసుల నమోదుపై ప్రచురితమైన ఈ కథనం సంచలనం సృష్టించింది. నాటి నుంచి సర్కారు ఆదేశాలతో వ్యవసాయ, పోలీస్‌శాఖల ఆధ్వర్యంలో జిల్లాల్లోని విత్తన దుకాణాలు, గోదాంలు, మిల్లులపై దాడులు నిర్వహిస్తున్నారు. క్వింటాళ్ల కొద్దీ నకిలీ విత్తనాలు పట్టుబడగా, వందల మందిపై కేసులు నమోదయ్యాయి.

‘సాక్షి’ కథనం తర్వాత సీడ్‌మెన్‌ అసోసియేషన్‌ సమావేశమైంది. ఇందులో ప్రస్తుతం కేసు నమోదైన బండ్ల రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ‘నాణ్యమైన సీడ్‌ను పండిస్తూ దేశవ్యాప్తంగా నడిగడ్డకు మంచిపేరును తీసుకొస్తామని.. కొందరు వ్యక్తులు గద్వాల సీడ్‌కు ఉన్న బ్రాండ్‌ను వినియోగించుకుని నకిలీవి ఉత్పత్తి చేస్తున్నారని, వాటితో తమకు సంబంధం లేదని’ తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన మిల్లులోనే నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి.
చదవండి: కల్తీ విత్తులతో కొల్లగొడతారు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు