అప్పుకు అనేక అవసరాలు.. ఇదే వారి పెట్టుబడి.. ప్రాణాలు పోయినా సరే!

12 Jan, 2022 04:10 IST|Sakshi

నిజామాబాద్‌కు చెందిన సురేష్‌ తన అవసరాల కోసం జ్ఞానేశ్వర్‌ దగ్గర రూ.50 లక్షలు, అతని అన్న వద్ద రూ.30 లక్షలు, మరో బంధువు వద్ద రూ.10 లక్షలు అప్పు తీసుకున్నాడు. జ్ఞానేశ్వర్‌కు ఇప్పటికే రూ.32 లక్షలు చెల్లించాడని తెలిసింది. ఇది వడ్డీలకే సరిపోతుందని, అసలు ఎప్పుడు చెల్లిస్తావంటూ అతడు సురేష్‌ను తీవ్రంగా వేధించాడు. మరోవైపు కరిపె గణేష్‌ వద్ద రూ.60 లక్షలు తీసుకున్న సురేష్‌.. రూ.40 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. అయినప్పటికీ అసలు డబ్బులు చెల్లించాలంటూ గణేష్‌ బెదిరించాడు. మరోవైపు నిర్మల్‌కు చెందిన చిట్టీల వ్యాపారి వినీత వద్ద తీసుకున్న చిట్టీ డబ్బులు చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఆమె కూడా వేధించసాగింది. ఈ నేపథ్యంలోనే సురేష్‌ కుటుంబసభ్యులు నాలుగురోజుల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డారు.

సాక్షి, హైదరాబాద్‌: వడ్డీ వ్యాపారుల ఆగడాలకు, దౌర్జన్యాలు, బెదిరింపులకు కుటుంబాలకు కుటుంబాలే బలైపోతున్నాయి. పంట పెట్టుబడికి అప్పు.. వ్యాపారం కోసం అప్పు.. చిన్న కుటుంబాల్లో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు అప్పు.. ఇలా అప్పుకు అనేక అవసరాలు, కారణాలున్నాయి. అయితే బాధితుడి అవసరాన్ని, పరిస్థితిని ఆసరాగా తీసుకుని వడ్డీ వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. అవసరం కొద్దీ అధిక వడ్డీకి తీసుకున్నా ఆ తర్వాత కనీసం వడ్డీ కూడా చెల్లించలేని పరిస్థితుల్లో కొన్నిచోట్ల వడ్డీపై వడ్డీ వసూలు చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి.

వడ్డీ కట్టలేక, అసలు అప్పు ఎన్నటికీ తీరే మార్గం లేక బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సురేష్‌ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడటం వడ్డీ వ్యాపారుల దోపిడీకో తాజా ఉదాహరణ. ఒక్క సురేష్‌ కుటుంబమే కాదు.. మాట పడితే ప్రాణం పోయినట్టుగా భావించే కుటుంబాలు వడ్డీ వ్యాపారుల బెదిరింపులకు భయపడి, ఆస్తుల జప్తుతో అవమానపడుతున్న ఎంతోమంది బాధితులు దిక్కుతోచని పరిస్థితుల్లో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. దారుణ ఘటనలు జరిగినప్పుడు పైపై దాడులు, కేసులతో సరిపెడుతుండటంతో వడ్డీ వ్యాపారుల దందా మూడు లక్షలు.. ఆరు కోట్లు అన్నట్టుగా సాగుతోంది. 

రాష్ట్రంలో వడ్డీ వ్యాపారానికి (మనీ లెండింగ్‌), చిట్టీలు, ఫైనాన్స్‌ సంస్థలకు అనుమతులు జారీ చేసే అధికారం స్థాయిల వారీగా జిల్లా కలెక్టర్‌ నుంచి మండల తహసీల్దార్‌ వరకు కల్పించారు. మొత్తం మీద కలెక్టర్‌కు దీనిపై అజమాయిషీ అధికారం ఉంటుంది. మనీ లెండింగ్‌ బిజినెస్‌కు అవసరమైన అనుమతి కోసం మీ సేవా సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్‌ తెలంగాణ మనీ లెండింగ్‌ యాక్ట్‌ 2017 ప్రకారం అనుమతి ఇస్తారు. కానీ రాష్ట్రంలో డెయిలీ ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం చేస్తున్న 90 శాతం మందికి ఎలాంటి అనుమతులు లేవు.

ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసు తర్వాతా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్‌ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసు తర్వాత కూడా వడ్డీ వ్యాపారుల్లో మార్పు రాలేదు. తనఖా పెట్టిన ఆస్తులను కాజేయడం, వడ్డీ పేరుతో తీసుకున్న అసలుకు పది రెట్లు కట్టించుకొని కూడా, ఇంకా అసలే తీరలేదనడం, ఆస్తులను రిజిస్టర్‌ చేయించుకోవడం వంటి ఘటనలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. 

గ్రేటర్‌లో రూ.1,200 కోట్ల వ్యాపారం!
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సగటున ప్రతి నెలా రూ.1,000 కోట్ల నుంచి రూ.1,200 కోట్ల వరకు జీరో వడ్డీ వ్యాపారం సాగుతోందని అంచనా. రోజువారీ వడ్డీ వ్యాపారం సాగించే వారి సంఖ్య నాలుగైదు వేల మంది వరకు ఉంటుందని పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కేవలం విలువైన భూములు, స్థలాలు, ప్లాట్స్, ఫ్లాట్స్‌ను మాత్రమే తనఖా ఉంచుకుని అప్పులివ్వటం వీరి ప్రత్యేకత. కొందరు ఖాళీ చెక్‌లు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని అప్పులిస్తున్నారు. వసూళ్ల కోసం రౌడీషీటర్లు, బౌన్సర్లను రంగంలోకి దింపి బాధితులను పీల్చి పిప్పి చేస్తున్నారు. 

జగిత్యాల మాఫియా రూటే సపరేటు
జగిత్యాల పట్టణంలో ప్రారంభంలో తక్కువ వడ్డీ అని ఎరవేసే వ్యాపారులు.. పోనుపోను తమ వికృతరూపాన్ని బయటపెడతారు. ప్రతినెలా 10 శాతం చొప్పున పెంచుకుంటూ.. పోయి వడ్డీకి వడ్డీలు కట్టి, చక్రవడ్డీలు అంటూ ఇచ్చిన వడ్డీ కంటే 20 రెట్లు అధికంగా వసూలు చేస్తారు. 1980ల్లోనే ఇక్కడ ఈ వ్యాపారం వేళ్లూనుకుపోయింది. 1990 నాటికే ఏటా దాదాపు రూ.1,200 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. వీరి వ్యాపారం ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు, హైదరాబాద్‌ వరకు విస్తరించింది.

గిరిగిరి.. నెలవారీ
గిరిగిరి, వీక్లీ, ఫైనాన్స్, నెలవారీ వడ్డీ తదితర పేర్లతో వ్యాపారులు డబ్బు అప్పు ఇస్తున్నారు. గిరిగిరిలో రూ.10 వేలు కావాల్సి వస్తే రూ.8 వేలు ఇస్తారు. రోజూ రూ.100 చొప్పున వంద రోజుల్లో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.10 వేలు నేరుగా ఇస్తే రోజుకు రూ.120 చొప్పున వందరోజులు కట్టాలి. నెలవారీ ఫైనాన్స్‌లో రూ.50 వేలు ఇస్తే రూ. 6,500 చొప్పున 10 నెలలు తిరిగి చెల్లించాలి. కొందరు బడా వ్యాపారులు తమ సహచర వ్యాపారులకు ఉదయం రూ.లక్ష ఇచ్చి, సాయంత్రానికి దానికి అదనంగా రూ.10,000 వసూలు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు