‘ఇల్లు కూల్చితే మా చావును చూస్తారు..’

12 Feb, 2021 09:56 IST|Sakshi

ఇల్లు కూల్చివేయడానికి వెళ్తే..

కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం

స్థానికంగా ఉద్రిక్తత 

సాక్షి, చంపాపేట(హైదరాబాద్‌): పక్కింటి యజమాని ఫిర్యాదుతో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది ఇంటిని కూల్చివేసేందుకు సమాయత్తం అవుతుండగా కూల్చివేతలు నిలిపివేయాలంటూ కుటుంబ సభ్యులు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని అనడంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సంఘటన గురువారం రాత్రి చంపాపేట డివిజన్‌లో చోటు చేసుకుంది. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్‌ దుర్గానగర్‌కాలనీకి చెందిన తేలుకుంట్ల రాజు 35 సంవత్సరాలుగా స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. తన ఇల్లు శిథిలావస్థకు చేరటంతో ఇటీవలే పాత ఇంటిని కూల్చి పునర్‌నిర్మాణం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఆయన ఇంటి పక్కనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న శ్రీనివాస్‌ ఇంటి పునర్‌నిర్మాణం చేసేందుకు అభ్యంతరం తెలిపి కోర్టు నుంచి స్టే ఆర్డరు కూడా తెచ్చారు. ఆవేమీ పట్టించుకోని రాజు ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేయటంతో గురువారం శ్రీనివాస్‌ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది జేసీబీతో సంఘటనా స్థలానికి చేరి ఇంటిని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా రాజు కుటుంబ సభ్యులు కూల్చివేత నిలిపేయాలంటూ కిరోసిన్‌ డబ్బాలు చేత పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చి రాజుకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.

మరిన్ని వార్తలు