ఒంట్లో బాగోలేదని: బామ్మను ఇంట్లోకి అనుమతించని మనుమరాలు

10 May, 2021 10:10 IST|Sakshi
రోడ్డు మీద మంచంపై పడిఉన్న శతాధిక వృద్ధురాలు తులసమ్మ. (ఇన్‌సెట్‌లో) మంచం పక్కనే కుమారుడు వెంకటస్వామి, కోడలు ప్రేమలత 

అద్దె ఇంట్లోంచి గెంటేసిన యజమానులు 

టెంటు కిందే తలదాచుకుంటున్న శతాధిక వృద్ధురాలు 

మాతృదినోత్సవం రోజునే వేములవాడలో ఘటన 

సాక్షి, వేములవాడ: ఆమె శతాధిక వృద్ధురాలు.. నిలువనీడలేదు.. మండుటెండలు.. పైగా అనారోగ్యం.. జీవిత చరమాంకంలో ఆ బామ్మకు ఎంత కష్టం! మాతృ దినోత్సవం రోజునే ఈ ముసలమ్మకు ఎంత కష్టం! తలదాచుకునేందుకు దిక్కులేక బిక్కుబిక్కుమంటోంది.. రోడ్డు పక్కన టెంట్‌ కింద మూలుగుతోంది. ఎములాడ రాజన్నకు కూడా ఆమె మూగరోదన వినిపించనట్టుంది! ‘బామ్మా.. మా ఇంటికి రా’అని ఆపన్నహస్తం అందించేవారే కరువయ్యారు. మానవత్వం మంటగలిసింది. వివరాలు... రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన పంబి వెంకటస్వామి తన తల్లి తులసమ్మ(103), భార్యతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

నాలుగు రోజుల క్రితం తులసమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఆమె చనిపోతే తమకు అరిష్టమని భావించి ఇంటి యజమానులు వారిని బయటకు వెళ్లగొట్టారు. దీంతో వెంకటస్వామి తల్లి, భార్యను తీసుకుని అదే పట్టణంలో ఉంటున్న తన కుమార్తె సునీత ఇంటికి వెళ్లాడు. అయితే, సునీత, ఆమె కుమారుడు శ్రీకాంత్, కూతురు.. బామ్మను ఇంట్లోకి రానివ్వలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న బామ్మకు ఏమైనా అయితే మంచిది కాదని భావించి, ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు.

దీంతో వెంకటస్వామి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సూచనతో మళ్లీ అద్దె ఇంటికి వెళ్లినా యజమానులు అనుమతించలేదు. గత్యంతరంలేక మళ్లీ తన కూతురి ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆమె ససేమిరా అనడంతో రోడ్డు పక్కన టెంట్‌ వేసుకొని దాని కిందే తన తల్లితో కలసి తలదాచుకుంటున్నారు. పోలీసులు స్పందించి వెంకటస్వామి కూతురు, మనుమడు, మనుమరాలుకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.
చదవండి: వేల ఏళ్ల క్రితమే కరోనా కజిన్‌ సిస్టర్‌!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు