మానవత్వానికి మసక..!

30 Jul, 2020 09:16 IST|Sakshi

ఈ నెల 22న గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన యువకుడు అకస్మాత్తుగా చనిపోయాడు. అదే సమయంలో అతడి మిత్రుడికి కరోనా  అని తేలింది. దీంతో మృతి చెందిన యువకుడికి కరోనా సోకి ఉంటుందనే భయంతో కుటుంబ సభ్యులూ అతని అంత్యక్రియలకు వెనకడుగు వేశారు. పాడే మోసే వాళ్లూ కరువవ్వడంతో స్థానిక సర్పంచ్‌ చొరవతో మృతదేహాన్ని జేసీబీలో వేసుకుని శ్మశానవాటికకు తరలించారు.  

సాక్షి, మహబూబ్‌నగర్‌: ‘‘మాయమైపోతున్నాడమ్మా..మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్న వాడు..’’ అన్నాడో సినీ కవి. ఉమ్మడి పాలమూరులో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే కనబడుతోంది. కరాళనృత్యం చేస్తున్న కరోనా మానవత్వాన్ని మంటగలుపుతోంది. పాడే మోసే వాళ్లను అటుంచితే కరోనాతో.. ఆ లక్షణాలతో చనిపోయిన వారి మృతదేహాలు తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులే ముందుకు రావడం లేదు. కనీసం వారిని కడసారి చూసేందుకూ బంధువులు ఇష్టపడడం లేదు. మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో అందరూ ఉన్నా అనాథగా మారిన నారాయణపేటకు చెందిన ఓ శవాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌ సూచనలతో వైద్య సిబ్బందే ఇటీవల ఖననం చేశారు.

కాగా జిల్లాకేంద్రానికి చెందిన రెండు, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు చెందిన మరో మృతదేహాలు మూడ్రోజుల పాటు మార్చురీలోనే ఉండిపోయాయి. మృతుల కుటుంబీకులకు సమాచారం ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు రంగంలో దిగిన వైద్యులు, పోలీసుల సహకారంతో మృతుల కుటుంబీకులకు బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించి, వారికి అప్పగించారు. ఇలాంటి సంఘటనలు జిల్లాస్పత్రిలో నిత్యాకృత్యమయ్యాయి. కరోనా రోగులకు చికిత్స చేయడం ఓ ఎత్తైతే మృతదేహాలు వారి బంధువులకు అప్పగించడం సర్కారు ఆస్పత్రి వైద్యులకు సవాలుగా మారుతోంది.

కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి మృతదేహాన్ని అప్పగిస్తున్న ఆస్పత్రి వైద్య సిబ్బంది 

యంత్రాలే సాధనాలుగా.. 
బతుకున్నంత కాలం దూరంగా ఉన్నా.. కనీసం చావైనా దగ్గరికి చేరుస్తుందనేది నానుడి. కానీ కరోనా రక్కసి, చావు తర్వాత కూడా మనిíÙని మనిషికి దగ్గరికి చేర్చడం లేదు. కరోనా లక్షణాలతో చనిపోయినా మృతదేహాలను ముట్టుకునేందుకు కుటుంబసభ్యులు ఇష్టపడడం లేదు. మృతదేహాన్ని కాటికి తీసుకెళ్లేందుకు ఆ నలుగురూ కరువౌతున్నారు. దీంతో జేసీబీలు, ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు, అంబులెన్సులే అంత్యక్రియల సాధనాలుగా మారుతున్నాయి. స్థానికులు సైతం మృతదేహాలను తమ ప్రాంతాలకు తీసుకురావద్దని, అంత్యక్రియలు వేరే ప్రాంతాల్లో చేసుకోవాలని తేల్చి చెబుతున్నారు. దీంతో కరోనా మృతులకు గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇక అద్దె ఇళ్లలో ఉంటోన్న వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. యజమానులు చెప్పినట్టుగా నడుచుకోకపోతే ఇల్లు ఖాళీ చేయమనే ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

కనీసం బంధువులను ఇంటికి రానీయడమే కాదు, బంధువుల ఇళ్లకూ వెళ్లొద్దనే ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా మృతుల అంత్యక్రియల్లో జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు. మృతుల కుటుంబ సభ్యులే పరిమితికి లోబడి పీపీ కిట్లు ధరించి అంత్యక్రియలు చేయవచ్చంటున్నారు. ఎన్‌–95 మాస్క్‌ చేతి గ్లౌజులు, ఫేస్‌షీల్డ్‌ ధరించాలని సూచిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కొంత దూరం వచ్చి వాడిన మాస్క్‌, గ్లౌజులు, ఫేస్‌ఫీల్డ్‌ దహనం చేయాలంటున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత రెండు సార్లు తలస్నానం చేయాలంటున్నారు. ఇదే క్రమంలో వైద్యసిబ్బంది సైతం అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతంలో సోడియం పిచికారీ చేస్తారు. కాగా కరోనాతో చనిపోయిన వారి దేహంపై ఆ వైరస్‌ అత్యధికంగా పది గంటల పాటు బతికి ఉంటుందని ఆ తర్వాత చచ్చిపోతుందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ కృష్ణ తెలిపారు.   

జూలై 7
నారాయణపేటకు చెందిన ఓ మహిళతో పాటు అతడి కుమారుడు కరోనా లక్షణాలతో మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రిలో చేరారు. వైద్య నిర్ధారణ పరీక్షల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ క్రమంలో సదరు మహిళా చికిత్స పొందుతూ ఈ నెల 16న చనిపోయింది. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాలని నారాయణపేట వైద్యుల ద్వారా మృతురాలి బంధువులకు సమాచారమిచ్చారు. వారు ఆ మృతదేహానికి మాకెలాంటి సంబంధం లేదని చెప్పారు. దీంతో ఆస్పత్రి సిబ్బందే మృతురాలి కుమారుడితో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న సదరు మహిళను చూసి నారాయణపేటలో ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి యాజమాని ఆస్పత్రిలో చేరే ముందే ఇళ్లు ఖాళీ చేయించినట్లు తెలిసింది. ఇటీవల కరోనాతో మృతి చెందిన జిల్లాకు చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.  

జూలై 11
దేవరకద్ర మండలం ఇసరంపల్లికి చెందిన మహిళ కరోనాతో గాంధీలో చనిపోయింది. ఆమె మృతదేహాన్ని గ్రామంలో తీసుకురావద్దని గ్రామస్తులు హెచ్చరించారు. దీంతో మృతురాలి కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి చాంద్రాయణగుట్టలో అంత్యక్రియలు నిర్వహించారు.

జూలై 18
మహబూబ్‌నగర్‌కి చెందిన ఓ వృద్దుడు కరోనాతో మృతి చెందాడు. అతని బంధువులు మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకురావడాన్ని చూసిన అక్కడి స్థానికులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. పోలీసుల చొరవతో అంత్యక్రియలు జరిగాయి. 

జూలై 25
గద్వాలకి చెందిన వ్యక్తికి కరోనా నిర్ధారణ అయింది. హోం క్వారంటైన్‌లో ఉన్న సదరు వ్యక్తి అదే రోజు రాత్రి చనిపోయాడు. రెండు రోజుల ముందే అతడి కుమారుడికీ కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబసభ్యులెవరూ ముందుకురాలేదు. చివరకు రంగంలో దిగిన వైద్యసిబ్బంది మృతుడి కుమారులు ఇద్దరికి పీపీకిట్లు ఇచ్చి వారి ద్వారా అంత్యక్రియలు చేయించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ ట్రాలీ ఆటోకు రూ.10వేలు ఇచ్చారు.

మరిన్ని వార్తలు