పట్టుబడగానే... మావాడు మంచోడే!

4 Apr, 2022 08:07 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: నాకేం తెలియదు.. మా పిల్లలు చాలా మంచి వారు.. అందులో మా పిల్లలు లేరు.. మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోంది.. ఇలా ఏదైనా ఘటనలో తమ పిల్లలు పట్టుబడగానే ప్రముఖులు నీతి సూక్తులు వల్లె వేస్తుంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజాము వరకు పిల్లలు ఇంటికి రాకపోతే ఎక్కడున్నారనే విషయం కూడా కొంత మంది తెలుసుకోవడంలేదు. తీరా ఏదైనా పబ్‌లోనో, రేవ్‌ పార్టీలోనో, రిసార్ట్స్‌లోనో మద్యం తాగి, డ్రగ్స్‌ తీసుకుంటూ పట్టుబడితే మాత్రం ఆ ఘటనతో తమకేమీ సంబంధం లేదంటూ బుకాయిస్తున్నారు.

తాజాగా బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ పబ్‌లో రేవ్‌ పార్టీలో పాల్గొని టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినవారి కుటుంబ సభ్యులందరు డ్రగ్స్‌తో సంబంధం లేదంటూ ఒకేతీరుగా సమాధానాలు చెప్పారు. ఇక ఓ రాజకీయనేత కుమారుడు పట్టుబడ్డాడంటూ మీడియాలో ప్రసారం కాగానే ఆ కుటుంబం వెంటనే స్పందించి తమవాడు అక్కడ లేడంటూ చెప్పుకొచ్చారు. తీరా చూస్తే మీడియాలో వచ్చిన పేరుతో ఉన్న కొడుకు లేడు కానీ ఆ రాజకీయ నాయకుడి ఇంకో కొడుకు మాత్రం పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఎక్కడ పార్టీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డా ఇలాగే బుకాయించేస్తున్నారు.

ఇటీవల జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45లో అదుపు తప్పిన వేగంతో దూసుకొచ్చి ఓ రాజకీయ నాయకుడి తనయుడు ఓ చంటి బిడ్డ ప్రాణాన్ని బలిగొన్న ఘటనలో కూడా ఆ నేత ఆ కారులో తన కొడుకే లేడంటూ గట్టిగా వాదించాడు. తీరా చూస్తే కారులో వెనుక సీటులో ఆ నేత కొడుకు దర్జాగా కూర్చొని ఉన్నాడు. ఇక శివార్లలో రిసార్ట్‌లకు వెళ్తే అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇలాంటి గానా బజానాలు, రేవ్‌ పార్టీలు, డ్రగ్స్‌ పార్టీలు కోకొల్లలు. దొరికిన సందర్భాల్లో ప్రముఖులు తమ పిల్లలను ఇలాగే వెనుకేసుకొస్తున్నారు. 

బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా నాగేశ్వర్‌రావు 
బంజారాహిల్స్‌ నూతన ఇన్‌స్పెక్టర్‌గా 2004 బ్యాచ్‌కు చెందిన కె. నాగేశ్వర్‌రావును నియమిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. గతంలో పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్‌ఐగా పని చేశారు. బంజారాహిల్స్‌ సీఐగా పని చేసిన పూసపాటి శివచంద్రను విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన కారణంగా సస్పెండ్‌ చేశారు. ఆయన స్థానంలో 
నాగేశ్వర్‌రావును నియమించారు. 

మరిన్ని వార్తలు