సాహితీమూర్తి ‘వాసాల’ కన్నుమూత

15 Feb, 2021 10:04 IST|Sakshi
కేంద్రసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత వాసాల నరసయ్య(ఫైల్‌ఫోటో)

40 ఏళ్లుగా బాలసాహిత్య రచనకు అంకితం 

2017లో కేంద్రసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం  

36 పుస్తకాలు వెలువరించిన రచయిత  

కరీంనగర్‌ కల్చరల్‌: బాలల మనోవికాసానికి బాటలు వేసిన బాలసాహితీమూర్తి, కేంద్రసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత వాసాల నరసయ్య(79) కరీంనగర్‌లో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 40 ఏళ్లుగా బాలసాహిత్య రచనకు అంకితమై కథ, కవిత, గేయం, పొడుపు కథ రూపాల్లో 36 పుస్తకాలు వెలువరించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మెట్‌పల్లి మండలం చౌలమద్దిలో 1942, జనవరి 26న నరసయ్య జన్మించారు. పోస్టల్‌ శాఖలో హెడ్‌ పోస్ట్‌మాస్టర్‌గా 2002లో ఉద్యోగవిరమణ పొందారు. 2017, నవంబర్‌ 14న కేంద్రసాహిత్య అకాడమీ వారు బాలసాహిత్య పురస్కారంతో సత్కరించారు. నరసయ్య 8వ తరగతిలోనే పాఠశాల మ్యాగజైన్‌కు సంపాదకత్వం వహించారు.

ఆయన కథలలో ‘బాలల బొమ్మల కథలు’, ‘చిట్టిపొట్టి కథలు’, ‘అంజయ్య–అరటితొక్క’, ‘రామయ్యయుక్తి’ ప్రముఖమైనవి. చిరు తరంగాలు, గోగుపూలు, పసిమొగ్గలు, గులాబీలు వంటి బాలల కథల పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. బొమ్మరిల్లు, చందమామ, బాలమిత్ర, బాలభారతం, మొలక, బుజ్జాయి వంటి బాలసాహిత్య పత్రికల్లో ఆయన కథలు, గేయాలు ప్రచురితమయ్యాయి. బాల సాహితీవేత్తలను ప్రోత్సహించేందుకు 2009 నుంచి నరసయ్య సాహిత్య పురస్కారాలు అందజేస్తున్నారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని 12 మందికి ఈ పురస్కారం అందించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

నరసయ్య మృతికి సంతాపం 
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వాసాల నరసయ్య మృతికి గండ్ర లక్ష్మణరావు, దాస్యం సేనాధిపతి, కల్వకుంట రామకృష్ట, మాడిశెట్టి గోపాల్, కేఎస్‌ అనంతాచార్య , బీవీవీఎన్‌ స్వామి, ఇశ్రాత్‌ సుల్తానా, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, పొన్నం రవిచంద్ర, కూకట్ల తిరుపతి తదితర కవులు సంతాపం ప్రకటించారు. స్వగ్రామంలో నరసయ్య భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.    
 

మరిన్ని వార్తలు