ప్రఖ్యాత చిత్రకారుడు చంద్ర కన్నుమూత 

30 Apr, 2021 02:39 IST|Sakshi

కరోనాకు చికిత్స పొందుతూ కార్డియాక్‌ అరెస్టుతో తుదిశ్వాస

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మూడేళ్లుగా మంచానికే పరిమితం

విలక్షణమైన శైలి, వ్యంగ్య చిత్రాలకు పెట్టింది పేరు

విరసంతో అనుబంధం.. ఎమర్జెన్సీ కాలంలో జైలుశిక్ష

ఆయన మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సహా ప్రముఖుల సంతాపం 

సాక్షి, హైదరాబాద్‌/హన్మకొండ కల్చరల్‌: ప్రఖ్యాత చిత్రకారుడు, కథా రచయిత, కార్టూనిస్టు, ఇలస్ట్రేషనిస్టు చంద్ర (75) ఇక లేరు. ఆయన అసలు పేరు మైదం చంద్రశేఖర్‌. కరోనా బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ఆర్‌.కె. మదర్‌ థెరెసా రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి 1:40 గంటలకు కార్డియాక్‌ అరెస్టుతో కన్నుమూశారు. మూడేళ్ల క్రితం బాత్రూంలో కాలు జారిపడటంతో బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన ఆయన అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. కొద్దిరోజుల క్రితం కరోనా సోకడం, కార్డియాక్‌ అరెస్టుకు గురికావడంతో ఆయన మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య విజయభార్గవి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం జరిగాయి.

చిన్ననాటి నుంచే చిత్రకళపై అభిరుచి...
పూర్వ వరంగల్‌ జిల్లా కేసముద్రం మండలం ధన్నసరి గ్రామానికి చెందిన మైదం రంగయ్య, సోమలక్ష్మి దంపతులకు 1946 ఆగస్టు 28న చంద్ర జన్మించారు. తల్లి ఎడ్లబండిలో వెళ్తున్న క్రమంలో నిండు పున్నమి రోజున జన్మించడంతో ఆయనకు చంద్రశేఖర్‌గా పేరు పెట్టారు. స్కూల్లో చదివే రోజుల్లో ప్రతి ఆదివారం ఖిలా వరంగల్‌ వెళ్లి అక్కడి శిల్పాలను చూస్తూ వాటి బొమ్మలు వేయడానికి ప్రయత్నించేవారు. వరంగల్‌లోని అజంజాహి మిల్లులో తొలుత పనిచేసిన ఆయన తండ్రి ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆప్కోలో చేరడంతో కుటుంబం హైదరాబాద్‌కు మారింది. హైదరాబాద్‌లో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పల్లా దుర్గయ్య ఇంట్లో వారు ఉండే సమయంలో వట్టికోట ఆళ్వార్‌స్వామి, దాశరథి కృష్ణమాచార్య తదితర సాహితీవేత్తలతో చంద్రకు పరిచయం ఏర్పడింది. అలాగే సుల్తాన్‌ బజార్‌లోని లైబ్రరీ చంద్ర వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.
 
డాక్టర్‌ వద్దనుకొని చిత్రకారుడిగా..
బాపు బొమ్మలను చూస్తూ చిత్రాలను వేయడం మొదలుపెట్టిన చంద్ర.. పీయూసీ చదివే రోజుల్లోనే సిటీ ఇన్‌ ద లైట్‌ చిత్రం వేసి ఉపాధ్యాయులను ఆశ్చర్యపర్చారు. పీయూసీ పరీక్షల్లో పాసైతే తండ్రి తనను మెడిసిన్‌ చదివించే అవకాశం ఉండటంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా రాయకుండా వచ్చేశారు. చిత్రకారుడిగా కావాలనే కృతనిశ్చయంతో హైదరాబాద్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ పూర్తి చేశాక విజయభార్గవిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 

సినీరంగంతోనూ అనుబంధం...
చంద్ర పలు నాటకాల్లో నటించారు. చిల్లర దేవుళ్లు చిత్రంతోపాటు మరో బెంగాల్‌ చిత్రంలోనూ హీరోగా నటించే అవకాశం వచ్చినా నటించలేదు. చిల్లర దేవుళ్లు, చలిచీమలు, తరం మారింది, మంచు పల్లకి, డిటెక్టివ్‌ నారద తదితర 20 చిత్రాలు, 6 లఘుచిత్రాలకు కళాదర్శకుడిగా పనిచేశారు. అలాగే రచయితగా, సాహితీవేత్తగా 150 కథలు, అనేక కవితలు రాశారు. యర్రంశెట్టి సాయి, పమ్మి వీరభద్రరావులతో కలసి గొలుసు నవల కూడా రాశారు. మల్లాది, సూర్యదేవర, యండమూరి వీరేంద్రనాథ్‌ వంటి రచయితల నవలలు చంద్ర ముఖచిత్రాలతో ఆకట్టుకొనేవి. స్వాతి, ఆంధ్రభూమి వంటి వారపత్రికలకు ఆయన క్రమం తప్పకుండా బొమ్మలు గీసేవారు. ప్రఖ్యాత చిత్రకారుడు బాపు ప్రశంసలను  అందుకున్నారు. దాశరథి కృష్ణమాచార్య, పల్లా దుర్గయ్య, కాళోజీలకు అత్యంత సన్నిహితంగా మెలిగారు.

సీఎం కేసీఆర్‌ సంతాపం...
ప్రముఖ చిత్రకారుడు, ఇల్లస్ట్రేటర్‌ చంద్రశేఖర్‌ (చంద్ర) మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్ర మృతికి ప్రొఫెసర్‌ జయధీర్‌ తిరుమలరావు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, డాక్టర్‌ తిరుక్కోవలూరు శ్రీరంగస్వామి, ఆర్టిస్ట్‌ మల్లిక్‌ తదితరులు సైతం సంతాపం తెలిపారు.

ముఖ చిత్రాలు..వ్యంగ్య చిత్రాలకు పెట్టింది పేరు
చంద్ర అనేక దినపత్రికలు, వారపత్రికలు, మాసపత్రికలలో వ్యంగ్య చిత్రాలు, కథలకు బొమ్మలు వేసేవారు. ప్రముఖుల రేఖా చిత్రాలు గీసి ప్రత్యేకత చాటుకున్నారు. నవలలు, పుస్తకాలకు ఆయన వేసిన ముఖ చిత్రాలు ప్రధాన ఆకర్షణగా ఉండేవి.
1970 నుంచి 2010 వరకు చంద్ర వేసిన ముఖచిత్రాలతో కొన్ని వేల పుస్తకాలు వెలు వడ్డాయి. మనుషుల మానసిక ప్రపంచాన్ని, స్త్రీ పురుషుల్లోని ఆంగిక సౌందర్యాన్ని ఎంతో కళాత్మకంగా చిత్రించిన ప్రత్యేక శైలి ఆయనది. ప్రపంచంలో విప్లవాల దశ కొనసాగిన సమయాన తన కళను ఆయుధంగా చేయాలనుకొని విరసం కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష కూడా అనుభవించారు.

మరిన్ని వార్తలు