సవాళ్లను అధిగమిస్తేనే విజయం : జస్టిస్‌ హిమాకోహ్లి

28 Aug, 2021 01:37 IST|Sakshi
జస్టిస్‌ కోహ్లిని సత్కరిస్తున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం

వీడ్కోలు సమావేశంలో జస్టిస్‌ హిమాకోహ్లి వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: సవాళ్లను అధిగమిస్తేనే విజయం వరిస్తుందని, న్యాయవాదులు రాణించాలంటే నిజాయతీ, నిబద్ధత, కష్టించేతత్వం, చిత్తశుద్ధి ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా  పదోన్నతిపై వెళ్తున్న జస్టిస్‌ హిమాకోహ్లి అన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సెప్టెంబర్‌ 1న పదవీ విరమణ చేస్తానని భావించిన తనకు పదో న్నతి ఇచ్చి సుప్రీంకోర్టుకు పంపుతున్నారని, ఇం దుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణకు, కొలీజియంకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. జస్టిస్‌ హిమాకోహ్లికి శుక్రవారం సీజే కోర్టుహాల్‌లో హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ఫుల్‌కోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా జస్టిస్‌ కోహ్లి మాట్లాడారు. ‘1980ల్లో ఢిల్లీలాంటి మెట్రోపాలిటన్‌ నగరంలో కూడా మహిళా న్యాయవాదుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేసిన 22 ఏళ్లలో, జడ్జిగా పనిచేసిన 15 ఏళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఒక నాణేనికి బొమ్మాబొరుసులాంటి వారు. వీరిద్దరూ సమన్వయంతో పనిచేసినప్పుడే కేసుల సత్వర విచారణ సాధ్యమతుంది’అని పేర్కొన్నారు. చదవండి: TS High Court: హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ ఎంఎస్‌  రామచందర్‌రావు 

8 నెలల్లో 1,731 కేసులు.. 
‘నాతోపాటు ధర్మాసనంలో జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి కేసుల సత్వర పరిష్కారానికి సహకరించారు. ఈ 8 నెలల కాలంలో 1,731 కేసులను పరిష్కరించాం. అలాగే సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 200 కుటుంబ వివాదాల్లో ఇరువర్గాలను ఒప్పించి రాజీమార్గం ద్వారా పరిష్కరించాం. ఇటీవల ఆరుగురు జిల్లా జడ్జిల, ఏడుగురు న్యాయవాదుల పేర్లను హైకోర్టు జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియంకు సిఫార్సు చేశాం. హైకోర్టులో 2.30 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులు సత్వర పరిష్కారం కావాలంటే న్యాయమూర్తుల నియామకాలు వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తుల సంఖ్య 11 ఉండగా, త్వరలోగా ఆ సంఖ్య 34కు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా’ అని జస్టిస్‌ కోహ్లి పేర్కొన్నారు.

అనంతరం హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్‌ హిమకోహ్లీని ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావుతోపాటు ఇతర న్యాయమూర్తులు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విభు భక్రూ, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌రెడ్డి, అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతాప్‌రెడ్డితోపాటు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  చదవండి: Bandaru Dattatreya: నేనూ పేద కుటుంబం నుంచే వచ్చా

చట్టబద్ధ పాలనే మన మతం.. 
‘రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాం. చట్టబద్ద పాలనే మన మతం. ప్రజలు.. ప్రాం తీయ, మత, కులతత్వాలను విడిచిపెట్టాలి. స్వేచ్ఛాయుత ఆలోచనలు పంచుకోవాలి. ప్రజాస్వామిక సంప్రదాయాలు పాటించాలి. హైదరాబాద్‌.. ఆధునికత, సంప్రదాయం కలగలిసిన గొప్ప సంస్కృతికి ప్రతీక. ప్రధాన న్యాయమూర్తిగా నా పేరును సిఫార్సు చేయడానికి నెల రోజుల ముందు ఒక మిత్రుడు ఈ హైకోర్టు భవన చిత్రాలను పంపించారు. ఆ చిత్రాలను చూసి మంత్రముగ్ధురాలినయ్యా.  ఇక్కడ పనిచేయడం చాలా గర్వంగా ఉంది’అని జస్టిస్‌ కోహ్లి వివరించారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు