ఇదేక్కడి విడ్డూరం! ఎద్దు మూత్రం పోసిందని కేసు.. ఖమ్మం రైతుకు రూ.100 ఫైన్‌

6 Dec, 2022 18:54 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: మనుషులే రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఓ ఎద్దు రోడ్డుపై మూత్రం పోసిందని అధికారులు కేసు పెట్టారు. యజమానికి కోర్టు రూ.100 ఫైన్‌ కూడా వేసింది. ఎద్దు ముత్రం పోస్తే ఫైన్‌ ఏంటని ఆలోచిస్తున్నారా? అవును నిజమే. ఈ విడ్డూరం భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో వెలుగు చూసింది. 

ఇంతకీ ఏం జరిగిందంటే?
సింగరేణి గనులకు పుట్టినిల్లు జిల్లాలోని ఇల్లందు పట్టణం. అక్కడే ఉండే సుందర్‌ లాల్‌ అనే ఓ రైతు తన ఎద్దుల బండిని కిరాయికి తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సింగరేణి జీఎం కార్యాలయానికి సమీపంలో నివస్తుండటంతో రోజూ ఆఫీసు ముందు నుంచి వెళ్తాడు. అయితే, ఒకరోజు జీఎం కార్యాలయం ముందు ఎద్దు మూత్రం పోసింది. దానిని గమనించిన అక్కడి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ను అందించి ఎద్దుల యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు సుందర్‌ లాల్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఎన్నడూ పోలీస్‌ స్టేషన్‌ ముఖం చూడని సుందర్‌ లాల్‌ భయం భయంగానే వెళ్లి ఏం జరిగిందని ఆరా తీయగా.. అసలు విషయం చెప్పారు. నీ ఎద్దు జీఎం ఆఫీసు ముందు మూత్రం పోసింది. గతంలోనూ నీ ఎద్దు ఇలానే చేసిందటా అని వెల్లడించారు. దీంతో సుందర్‌ లాల్‌ అవక్కయ్యాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారించిన న్యాయమూర్తి సుందర్‌లాల్‌కు రూ.100 జరిమానా విధించారు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ రూ.100 ఇచ్చి ఫైన్‌ చెల్లించడం గమనార్హం. . 

అసలు విషయం వేరే ఉందా?
రైతు సుందర్‌ లాల్‌ను ఇబ్బంది పెట్టడానికి వెనుక మరో కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ భూమికి సంబంధించి సింగరేణి నుంచి తనకు పరిహారం ఇవ్వాలని సుందర్‌ లాల్‌ డిమాండ్‌ చేస్తున్నారు. తన భూమిని బలవంతంగా తీసుకున్నారని, చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నానని సుందర్‌లాల్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణంగా ఎద్దులు మూత్రం చేస్తుండగా నడవవని, తాను మూత్ర విసర్జన చేయమని చెప్పలేదన్నారు. సింగరేణి వల్ల తనకు అన్యాయం జరిగిందనే బ్యానర్లను ఎద్దుల బండికి కట్టి నగరంలో తిరుగుతున్నాడు సుందర్‌ లాల్‌. తమ సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు వాపోయాడు. తనకు న్యాయం చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టొద్దని ఆయన కూతురు విజ్ఞప్తి చేసిన ఓ వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

జీఎం ఏమన్నారంటే?
సింగరేణి జీఎం ఎం షలీం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..‘2005లో జేకే-5 ఓపెన్‌ కాస్ట్‌ మైన్‌ కోసం భూములు తీసుకున్నాం. సుందర్‌ లాల్‌కు చెందిన కొంత భూమి అందులో ఉంది. పట్టాదారుకు భూసేకరణ అధికారులు నగదు చెల్లించారు. దీనిపై సుందర్‌ లాల్‌ కోర్టుల్లో కేసులు వేశారు. సుప్రీం కోర్టు సైతం ఆయన ఫిర్యాదును తోసిపుచ్చింది. అప్పటి నుంచి ఆఫీసు వద్ద ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. అధికారులు, పోలీసులు చెప్పినా వినకుండా అలానే ప్రవర్తిస్తున్నాడు.’ అని తెలిపారు జీఎం. మరోవైపు.. ఈ విషయం తెలిసిన జనాలు.. చేసే పనులు సరిగా చేయరు.. కానీ ఇలాంటి పనికి మాలిన విషయాల్లో అత్యుత్సాహం చూపడం ఏంటని చర్చించుకుంటున్నారు.

ఇదీ చదవండి: సింగరేణి గనిలో కూలిన బండ 

మరిన్ని వార్తలు