చేనుకు నీళ్లు రాకుండా చేశాడని...

18 Feb, 2022 01:36 IST|Sakshi
శ్రీనివాసరావు (ఫైల్‌) 

మనస్తాపంతో రైతు ఆత్మహత్య 

చింతకాని: మొక్కజొన్న చేనుకు నీళ్లు రాకుండా అడ్డుకోవడమే కాకుండా, ప్రశ్నించినందుకు ఓ రైతుపై మరో రైతు దాడి చేయడంతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడెం గ్రామానికి చెందిన రైతు బొగ్గారపు శ్రీనివాసరావు (55) బుధవారం ఉదయం తన మొక్కజొన్న పంటకు సాగర్‌ నీళ్లు పెట్టేందుకు వెళ్లగా, గ్రామానికి చెందిన రాయల పూర్ణచందర్‌రావు నీరు రాకుండా కాలువకు అడ్డుగా రాళ్లు వేశాడు.

దీంతో శ్రీనివాసరావు మరో వ్యక్తిని వెంటతీసుకుని పూర్ణచందర్‌రావు వద్దకు వెళ్లి ప్రశ్నించాడు. తన మొక్కజొన్న చేను ఎండిపోతోందని, నీళ్లు రాకుండా అడ్డువేయడం సరికాదని పేర్కొన్నారు. మాటామాటా పెరగడంతో శ్రీనివాసరావు చెంపపై పూర్ణచందర్‌రావు చేయి చేసుకున్నాడు. దీంతో అవమానంగా భావించిన శ్రీనివాసరావు గురువారం తెల్లవారుజామున ఇంటి పెరడులో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ నాగేశ్వరరావు తెలిపారు.

మరిన్ని వార్తలు