భూ వివాదంతో ఆత్మహత్యకు యత్నం

28 Jan, 2021 08:29 IST|Sakshi

ఠాణా ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

భూ వివాదం నేపథ్యంలో మనస్తాపం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఘటన

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: భూ వివాదంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఓ రైతు పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బుధవారం చోటుచేసుకుంది. ఆయన పరిస్థితి ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటన కలకలం రేపింది. కమలాపూర్‌ పోలీసుస్టేషన్‌ ఎదుట 20 రోజుల్లో ఇది రెండో ఆత్మహత్యాయత్నం ఘటన కావడం గమనార్హం. 

కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కమలాపూర్‌ మండలం మర్రిపల్లికి చెందిన కుందూరు సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి కుటుంబీకులు సుమారు 50 ఏళ్ల కిందట తమ మేనమామ పింగిళి శ్రీరాంరెడ్డి నుంచి 11 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఇందులో 1.17 ఎకరాల భూమిని చందుపట్ల వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ భర్త చందుపట్ల సరోత్తంరెడ్డి అండతో వీరి మేనత్త పింగిళి శ్రీమతిదేవి ఆక్రమించుకుంది. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే శ్రీమతిదేవి ఆ భూమిలో వరి నాట్లు వేయగా శ్రీనివాస్‌రెడ్డి అడ్డుకున్నాడు. దీనిపై కమలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 24వ తేదీన కేసు నమోదైంది.

ఆ భూమిలోకి ఎవరూ వెళ్లవద్దని పోలీసులు ఆదేశించారు. అయితే బుధవారం శ్రీమతిదేవి సంబంధీకులు వెళ్లడంతో సంజీవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు అడ్డుకున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకోవద్దని, రెవెన్యూ అధికారులు లేదా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అక్కడి నుంచి పోలీస్స్టేషన్‌కు వెళ్లిన శ్రీనివాస్‌రెడ్డిని ఎస్‌ఐ పరమేశ్‌‌ బెదిరింపులకు గురి చేశాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీసుల నుంచి తనకు న్యాయం జరగడం లేదనే శ్రీనివాస్‌ రెడ్డి మనస్తాపానికి గురయ్యాడు.

ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి పోలీస్‌స్టేషన్‌ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన ఎస్‌ఐ జె.పరమేశ్‌ వెంటనే శ్రీనివాస్‌రెడ్డిని కమలాపూర్‌ పీహెచ్‌సీకి, అక్కడి నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ శ్రీనివాస్‌రెడ్డి కోలుకుంటున్నాడని, ఆయన ఆత్మహత్యాయత్నానికి పోలీసులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా ఇలాంటి సంఘటన కమలాపూర్‌ పోలీసుస్టేషన్‌ ఎదుట 20 రోజుల్లో ఇది రెండోది.

మరిన్ని వార్తలు