ఆశ పోయింది.. శ్వాస ఆగింది..కొనుగోలు కేంద్రంలోనే ఆగిన రైతు గుండె

8 Dec, 2021 01:52 IST|Sakshi

హుజూరాబాద్‌/జమ్మికుంట: ధాన్యంరాశి వద్ద ఇరవై రోజులుగా పడిగాపులు కాసినా, కొనే నాథుడులేడనే ఆవేదనతో అన్నదాత కన్ను మూశా డు. ఈ విషాదకర ఘటన కరీంనగర్‌ జిల్లాలో మంగళవారం జరిగింది.

జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య (59)కు 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు 20 రోజుల క్రితం పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ధాన్యం తేమగా ఉందని అధికారులు కొర్రీ పెట్టడంతో ఐలయ్య అక్కడే ధాన్యం ఆరబోసి 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళ వారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై వడ్ల రాశిపైనే కుప్పకూలి విగతజీవిగా మారాడు. ఆయనకు భార్య లక్ష్మి, కూతురు నిత్య ఉన్నారు. కొనుగోలులో జాప్యం చేయడం వల్లే ఐలయ్య మృతి చెందాడని, మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్‌రావు డిమాండ్‌ చేశారు. 

వడ్లు తెచ్చి 20 రోజులైతాంది
వడ్లను కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులైతాంది. తేమ ఉందని ఆరబెట్టాలని సార్లు చెప్పిన్లు. అప్పటిసంది కేంద్రంలోనే రోజూ ధాన్యం ఎండబెడుతున్నం. ఈ రోజు నా భర్త భోజనం చేసి, వడ్లను బస్తాలలో నింపేందుకు పోయిండు. కొద్దిసేపటికే చనిపోయిండని చెప్పిన్లు. నాకు దిక్కెవరు. ప్రభుత్వం ఆదుకోవాలె. – లక్ష్మి, మృతుడి భార్య 

టోకెన్‌ ఇచ్చాం
ఐలయ్య వారం క్రితం కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. ఆరబెట్టిన తర్వాత ఈ టోకెన్‌ జారీ చేశాం. ఈరోజు గన్నీ తీసుకొని నింపుతుండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో చనిపోయాడని తెలిసింది. – తిరుపతి, పీఏసీఎస్‌ సెంటర్‌ ఇన్‌చార్జి

ఐలయ్యది ఆకస్మిక మరణం: అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ లాల్‌
ఐలయ్య ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపే సమయంలో గుండెపోటుతో మృతి చెందారని అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్‌ 4న 10–10 రకానికి చెందిన దాదాపు 50 బస్తాల ధాన్యాన్ని తీసుకురాగా, 6న టోకెన్‌ జారీచేశామని పేర్కొన్నారు. ఐలయ్య మృతిపై జిల్లా సహకార అధికారి కార్యాలయం సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసూనతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు