రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

27 Jan, 2023 02:00 IST|Sakshi
ఆత్మహత్యాయత్నం చేస్తున్న  వెంకటేష్‌ కుటుంబ సభ్యులను  అడ్డుకుంటున్న పోలీసులు  

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఘటన 

మోటకొండూరు: గణతంత్ర వేడుకల వేళ ఓ రైతు కుటుంబం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.మోటకొండూరుకు చెందిన భూమండ్ల వెంకటేశ్‌కు భువనగిరి మండలంలోని చీమలకొండూరు రెవెన్యూ పరిధిలో 2.26 ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది.

అయితే బంట్రోతు నాగరత్నం అనే స్థానికేతర మహిళ ఆ భూమి తమదేనని పట్టా చేసుకోవాలని చూస్తోందంటూ వెంకటేశ్, అతడి భార్య శోభ, కుమారుడు శ్రీకాంత్‌ గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. మండల కేంద్రంలో నివాసం ఉండని నాగరత్నంకు స్థానిక రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

రికార్డులు పరిశీలించాకే సర్టిఫికెట్‌ ఇచ్చాం: తహసీల్దార్‌ జ్యోతి
అక్కడే ఉన్న మోటకొండూరు తహసీల్దార్‌ జ్యోతి బాధిత రైతుతో మాట్లా డుతూ ఫ్యామిలీ సర్టిఫికెట్‌ కావాలని గత నెలలో నాగరత్నం అర్జీ పెట్టుకుందని, రికార్డులు పరిశీలించగా ఆమె తాత నర్సెట్టి వెంకటస్వామికి చీమలకొండూరులో 1985లో పట్టా భూమి ఉందని గుర్తించి ఆమెకు ఫ్యామిలీ సర్టిఫికెట్‌ జారీ చేశామని పేర్కొన్నారు. ఆ భూమి భువనగిరి రెవెన్యూ పరిధిలో ఉన్నందున సమస్యను భువనగిరి తహసీల్దార్‌ కార్యాలయంలో పరిష్కరించుకోవా లని, అవసరమైతే ఆర్డీవోకు ఫిర్యాదు చేసుకోవాలని తహసీల్దార్‌ సూచించారు.

మరిన్ని వార్తలు