మాజీ ఐఏఎస్, కవి జె.బాపురెడ్డి కన్నుమూత

10 Feb, 2023 06:32 IST|Sakshi

నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు 

సిరిసిల్ల కల్చరల్‌: రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి జె.బాపురెడ్డి(86) బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. బాపురెడ్డి భార్య పదేళ్ల క్రితం కాలం చేశారు.బాపురెడ్డి ఇల్లంతకుంట మండలం సిరికొండకు చెందిన జంకె కృష్ణారెడ్డి, రామలక్ష్మి దంపతులకు 1936, జూలై 21న జన్మించారు. సినారె స్ఫూర్తితో 8వ ఏట నుంచి రచనలు చేశారు. పద్యం, గేయం, వచనం, విమర్శ, అనువాదం వంటి సాహితీ విభాగాల్లో రాణించారు. 36 పుస్తకాలు రచించారు.

చైతన్యరేఖలు, రాకెట్‌ రాయబారం వంటి గేయసంపుటాలు, ‘మనసులో మాట’వ్యాససంపుటి, ప్రణవ ప్రణయం, రంగురంగుల చీకట్లు వంటి పుస్తకాలను వెలువరించారు. తెలుగు, ఆంగ్లంతోపాటు పలు భారతీయ భాషల్లోకి సైతం ఆయన పుస్తకాలు అనువాదమయ్యాయి. ప్రపంచ కళాసంస్కృతుల అకాడమీ నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. ‘మన చేతుల్లోనే ఉంది’గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచన కవితా పురస్కారం అందుకున్నారు. 2016లో రాష్ట్ర ప్రభుత్వం దాశరథి పురస్కారంతో సత్కరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో స్నాతకోత్తర పట్టభద్రుడయ్యారు.

ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌లో చేరి మెదక్, వరంగల్‌ జిల్లాల కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం స్పెషల్‌ అసిస్టెంట్‌గా, భారత పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, పరిశ్రమల అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఏపీపీఎస్‌సీ సభ్యుడిగా విధులు నిర్వహించారు. పరిశ్రమల శాఖలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా పేరుగాంచారు. ప్రపంచ పర్యాటకుడిగా గుర్తింపు పొందిన ఆయన 37 దేశాల్లో పర్యటించారు. బాపురెడ్డి మరణంపై సాహితీవేత్తలు దిగ్భ్రాంతి చెందారు. సాహితీవేత్తలు బీఎస్‌ రాములు, డాక్టర్‌ పత్తిపాక మోహన్, జూకంటి జగన్నాథం తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు