ధాన్యం రాశిపైనే ఆగిన ఊపిరి

6 Nov, 2021 03:35 IST|Sakshi
చిన్న బీరయ్య (56)

వరి కొనుగోలు కేంద్రంలో వారం రోజులుగా బీరయ్య పడిగాపులు 

గురువారం రాత్రి నిద్రలో గుండెపోటు

కామారెడ్డి జిల్లా లింగంపేటలో ఘటన

సాక్షి, కామారెడ్డి/లింగంపేట:  ఈ ఏడాది వర్షాలు బాగా పడటంతో వరి మంచి దిగుబడి వచ్చింది.. రైతు సంబురంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. వారం రోజులైనా తన వంతు రాలేదు. రోజూ రాత్రి చలిలో ధాన్యం కుప్పల వద్దే పడుకున్నాడు. అదే కుప్పపై గుండెపోటుతో కన్నుమూశాడు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఈ మండలంలోని ఐలాపూర్‌కు చెందిన పాతింటి మామిడి చిన్న బీరయ్య (56) తనకున్న పొలంతోపాటు కౌలుకు తీసుకున్న భూమి కలిపి నాలుగున్నర ఎకరాల్లో వరి వేశాడు. వరికోతలు పూర్తికావడంతో గత నెల 27న లింగంపేట కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చాడు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు వరుస నంబర్లు కేటాయించగా.. బీరయ్యకు 70వ నంబర్‌ వచ్చింది. ఆ రోజు నుంచి ధాన్యం కోనుగోలు కోసం పడిగాపులు పడుతూ వచ్చాడు.

చలిగా ఉన్నా రోజూ రాత్రి ధాన్యం కుప్పవద్దే నిద్రపోయాడు. రెండు రోజులుగా కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడవడంతో ఆరబెడుతూ అవస్థలు పడ్డాడు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం ఇంటికి వెళ్లి భోజనం చేసి వచ్చి.. తన వడ్ల కుప్పపై పడుకున్నాడు. శుక్రవారం ఉదయం తోటి రైతులు గమనించే సరికి చనిపోయి ఉన్నాడు. అధికారులు బీరయ్య మృతదేహాన్ని ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా.. గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు తేల్చారు. ఇది తెలిసి కుటుంబ సభ్యులు ఆవేదనలో మునిగిపోయారు. ధాన్యం కొనుగోలు కాలేదన్న మనోవేదనతోనే బీరయ్య గుండెపోటుతో చనిపోయాడని ఆందోళన వ్యక్తం చేశారు. బీరయ్యకు భార్య పోచవ్వ, కుమారులు రాజేందర్, మహేశ్‌ ఉన్నారు. 

సీఎంవో అధికారుల ఆరా..! 
వరికుప్పపై రైతు మృతి చెందిన విషయమై ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆరా తీసినట్టు తెలిసింది. బీరయ్య ఎలా చనిపోయాడని జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కాగా.. కొనుగోలు కేంద్రం వద్ద రైతు మరణించిన వార్త దావానలంలా వ్యాపించడంతో.. చుట్టుపక్కల గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రైతు కుటుంబానికి సానుభూతి తెలిపారు. అయితే మండల, జిల్లా అధికారులెవరూ బీరయ్య చనిపోయిన కొనుగోలు కేంద్రం వద్దకు గానీ, ఆయన ఇంటికిగానీ రాలేదని స్థానికులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు