రైతు బిడ్డ నుంచి కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రస్థానం

7 Jul, 2021 19:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కేబినెట్‌ విస్తరణ కోసం  ప్రధాని నరేం‍ద్ర మోదీ ప్రభుత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. గడిచిన ఎన్నికలు, పనితీరు, సామాజిక కూర్పు, మహిళా కోటా తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ చేసింది. పాత, కొత్త వారిని కలుపుకుని మొత్తం 43 మందికి కేబినెట్‌లో చోటు కల్పించింది. కేబినెట్‌ విస్తరణలో భాగంగా తెలంగాణకు సముచిత స్థానం ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్ర హోం సహాయ మంత్రిగా పనిచేస్తున్న జీ.కిషన్‌రెడ్డికి కేబినెట్‌ మంత్రి హోదా కల్పించింది. ఆయన కేబినెట్‌ మంత్రిగా బుధవారం పదవి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన రైతు బిడ్డ నుంచి కేంద్ర కేబినెట్‌ మంత్రిగా ఎదిగారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి కుటుంబ, రాజకీయ ప్రొఫైల్‌..

కుటుంబ నేపథ్యం:
► జి స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు కిషన్ రెడ్డి 1964, మే 15న జన్మించారు. 
►  కిషన్‌రెడ్డి తండ్రి స్వామి వ్యవసాయ రైతు
►  రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం ఆయన స్వస్థలం. 
►  టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా పూర్తిచేశారు. 
►  1995లో కావ్యతో కిషన్‌రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం వైష్ణవి, తన్మయ్. 

రాజకీయ ప్రస్థానం..
►  1977లో జనతాపార్టీలో కిషన్ రెడ్డి చేరారు. 
►  1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో చేరారు. 
►  1980లో రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువమోర్చా కన్వీనర్ పదవీ చేపట్టారు. 
►  1983లో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి, 1984లో ప్రధాన కార్యదర్శి, 1985లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
►  1992లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యదర్శి, 1992లో ఉపాధ్యక్ష పదవి, 1994లో యువమోర్చా ప్రధాన కార్యదర్శి పదవులను అధిష్టించారు.


►  2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్ష పదవి చేపట్టారు.
►  2004లో హిమాయత్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 
►  2009 ఎన్నికల్లో నియోజకవర్గం మారింది. అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
►  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా 2010, మార్చి 6న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 
►  2014 ఎన్నికలో అంబర్ పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
►  2014లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
►  2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.
►  ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 

మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయమంత్రి
2019 ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఆయనకు హోంశాఖ సహాయమంత్రిగా స్థానం కల్పించారు. బుధవారం జరిగిన కేబినెట్ విస్తరణలో భాగంగా కిషన్‌రెడ్డికి కేంద్ర కేబినెట్‌ మంత్రిగా  పదోన్నతి కల్పించారు. 

మరిన్ని వార్తలు