మాస్టర్‌ ప్లాన్‌ కేసు విచారణ 11కు వాయిదా

10 Jan, 2023 01:12 IST|Sakshi

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై హైకోర్టును ఆశ్రయించిన రైతులు

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి మున్సిపల్‌ మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ 2వ వార్డు రామేశ్వరపల్లి చెందిన 40 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమను సంప్రదించకుండానే తమ భూములున్న ప్రాంతాన్ని రిక్రియేషన్‌ జోన్‌ గా ప్రకటించారని రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ మాధవిదేవి విచారణ చేపట్టగా, పిటిషనర్ల పక్షాన న్యాయ వాది సృజన్‌రెడ్డి మాస్టర్‌ప్లాన్‌ మ్యాప్‌ను కోర్టుకు సమర్పించి వాదనలు వినిపించారు.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)ను న్యాయమూర్తి వివరణ కోరగా, ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. ఏజీ విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయమూర్తి తదుపరి విచారణ బుధవారానికి (ఈ నెల 11) వాయిదా వేశారు. కాగా, విచారణ సందర్భంగా హైకోర్టుకు హాజరైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు.

అయితే న్యాయమూర్తి ఆయన వాదనలను తోసిపుచ్చారు. ఇప్పటికే మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయాలని రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నెల 11న అభ్యంతరాల గడువు ముగియనుంది. తర్వాత కౌన్సిల్‌లో చర్చించనున్నారు. కోర్టు పరిధిలో మాస్టర్‌ప్లాన్‌ అంశం ఉండటంతో బుధవారం కోర్టులో వాదనలు, తీర్పు తర్వాతే కౌన్సిల్‌ సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.   

మరిన్ని వార్తలు