బీమా లేక రైతు డీలా...

19 Nov, 2020 03:58 IST|Sakshi

ఈ ఏడాది అకాల వర్షాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం

కేంద్ర బీమా పథకాల నుంచి వైదొలగిన రాష్ట్ర ప్రభుత్వం

ఈసారి పరిహారం అందే పరిస్థితి లేక రైతుల దిగాలు 

‘ప్రత్యామ్నాయ’ ఏర్పాట్లపై నోరు మెదపని వ్యవసాయ శాఖ

సాక్షి, హైదరాబాద్‌ : పంటల బీమా లేక రైతులు ఉసూరుమంటున్నారు. పంట నష్టపోయినా.. పరిహారం అందే పరిస్థితి లేక దిగాలు పడుతున్నారు. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో కురిసిన భారీ వర్షాలతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినా పరిహారం దక్కని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారమే ఈ ఏడాది ఆగస్టులో 3.57 లక్షల ఎకరాలు, సెప్టెంబర్‌లో 1.92 లక్షల ఎకరాలు, అక్టోబర్‌లో 7.35 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

రైతుకు అనుకూలంగా లేదన్న భావనతో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాల నుంచి ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చేసింది. అయితే, దీనికి తగిన ప్రత్యామ్నాయం మాత్రం కరువైంది. దీంతో పంట పండిస్తే ఇక అమ్ముకునే వరకు రైతులు దేవుడిపైనే భారం వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు కేంద్రం అమలు చేసిన బీమా పథకాలు రైతులకు నష్టం చేకూర్చడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చిందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. పలు ఇతర రాష్ట్రాలూ ఈ ఏడాది నుంచి ఆ బీమా పథకాల నుంచి బయటకు వచ్చాయని అధికారులు అంటున్నారు.

బీమా కంపెనీల దోపిడీ పర్వం
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన బీమా పథకం ద్వారా బీమా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడంపైనే దృష్టిసారించాయి. దీంతో తెలంగాణ నుంచి కోట్ల రూపాయల లబ్ధిపొందాయి. లాభాలు గణనీయంగా ఉన్నా బీమా కంపెనీలు ఏటేటా ప్రీమియం రేట్లను భారీగా పెంచాయి. రైతుల నుంచి ప్రీమియం పేరిట భారీగా గుంజుతున్న బీమా కంపెనీలు పరిహారాన్ని మాత్రం అంతంతగానే విదుల్చుతున్నాయి. ఒక్క 2015–16 సంవత్సరం మినహా మిగతా ఏ ఏడాదీ రైతులకు పరిహారం సరిగా అందిన దాఖలాల్లేవు.

తెలంగాణలో రబీలో చెల్లించే ప్రీమియం మొత్తం దాదాపు బీమా కంపెనీలను బాగు చేయడానికే అన్నట్లుగా అమలవుతోంది. ప్రైవేటు బీమా సంస్థలకు పంటల బీమా పథకంలో అవకాశం కల్పించడంతో పరిస్థితి మరింత దిగజారింది. పీఎంఎఫ్‌బీవై కింద రైతులు వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుములకు రెండు శాతం, పసుపు రైతులు ఐదు శాతం ప్రీమియం చెల్లించారు. పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, మిరప, ఆయిల్‌పాం, బత్తాయి పంటలకు పంట రుణంలో 5 శాతం ప్రీమియం చెల్లించారు. పైగా జిల్లా జిల్లాకు ప్రీమియం ధరలు మారుతుండేవి.

ఉదాహరణకు 2018లో పెసరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో హెక్టారుకు ప్రీమియం సొమ్ము రూ.24,165, మిరపకు అత్యధికంగా రూ.38,715గా ఖరారు చేశారు. ఇంత దారుణంగా ప్రీమియం రేట్లు ఉండటంతో రైతులు కూడా పంటల బీమాపై విసుగు చెందారు. అలాగే వివిధ దశల్లో విధిస్తున్న షరతులు, నిబంధనలతో బీమా నష్టపరిహారం పొందడం గగనమైంది. విచిత్రమేంటంటే ఇప్పటికీ గతంలో చెల్లించిన బీమా పరిహారం బకాయిలను కంపెనీలు తీర్చలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. 2018–19, 2019–20 సంవత్సరాలకు రైతులు పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించారు. అందుకోసం ఆ రెండేళ్లకు కలిపి బీమా కంపెనీలు రూ.800 కోట్లు రైతులకు క్లెయిమ్స్‌ కింద సొమ్ము చెల్లించాల్సి ఉందని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నిసార్లు విన్నవించినా ఆ సొమ్ము ఇవ్వడంలో కొర్రీలు పెడుతున్నాయని అంటున్నారు. నష్టపోయిన రైతులు ఆ పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో రైతు యూనిట్‌గా పంటల బీమా?
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న బీమా పథకాలు కంపెనీలను బాగు చేసేవిగా ఉన్నాయన్న అభిప్రాయంతో వ్యవసాయశాఖ వర్గాలున్నాయి. అందువల్ల ఆ పథకాల నుంచి ప్రభుత్వం బయటకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ బీమా పథకాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక పంటల బీమా పథకాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై గతంలో వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. రైతు యూనిట్‌గా దీన్ని తీసుకురావాలని అప్పట్లో భావించినా, ఇప్పటికీ దానికి ఎలాంటి రూపురేఖలూ ఇవ్వలేదు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం వ్యక్తిగత బీమా పథకాన్ని అమలుచేస్తోంది. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా అందేలా ఈ పథకం అమలవుతుంది. ఇది పకడ్బందీగా అమలవుతుండటంతో, పంటల బీమా పథకాన్ని కూడా ప్రవేశపెడితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులెవరూ నోరు మెదపట్లేదు. ఇప్పటికే దేశంలో కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో విసిగివేసారి బయటకు వచ్చి, సొంత పథకాలను రూపొందించుకున్నాయని అధికారులు అంటున్నారు.

ఆ విషయం తెలియదు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల బీమా పథకాల నుంచి అనేక రాష్ట్రాలు బయటకు వచ్చాయి. మన రాష్ట్రం సహా పంజాబ్, జార్ఖండ్, గుజరాత్, పశ్చిమబెంగాల్‌ ఈ ఏడాది నుంచి పీఎంఎఫ్‌బీవై, పునరుద్ధరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాల నుంచి వైదొలిగాయి. ఈ బీమా పథకాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని రూపొందించాలన్న విషయం నా పరిధిలోనిది కాదు. గతంలో ఎలాంటి కసరత్తు జరిగిందో తెలియదు.
– జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి, తెలంగాణ వ్యవసాయశాఖ

మరిన్ని వార్తలు