రైతన్న.. కొత్త రూటన్న!

29 Nov, 2020 09:07 IST|Sakshi

సన్నరకం బియ్యం నేరుగా అమ్ముకుంటున్న రైతులు 

మార్కెట్లో మద్దతు ధర కరువైన ఫలితం

మిల్లుల వద్ద మరపట్టించి బియ్యంగా మార్చి అమ్మకాలు 

వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రచారం.. రైతుకు ‘మద్దతు’గా వినియోగదారులు 

సాక్షి, కామారెడ్డి: రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటకు సరైన ‘మద్దతు’ కరువవుతోంది. గత్యంతరం లేక దళారులు చెప్పిన ధరకే దాసోహం కావాల్సిన పరిస్థితి.. సన్నాలు సాగుచేసిన రైతులు అటు పంట దిగుబడి రాక, ఇటు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్‌ ఇస్తామని చెప్పినా, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో కొందరు రైతులు కొత్తదారులు వెతుకుతున్నారు. తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోలేక, వాటిని మర పట్టించి బియ్యం అమ్ముతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల పలువురు రైతులు సన్నవడ్లను మిల్లింగ్‌ చేయించి, అవసరం ఉన్న వారికి నేరుగా బియ్యం విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. 

దిగుబడి దెబ్బ.. ‘మద్దతు’ కరువు 
ఈసారి వర్షాకాలంలో రాష్ట్రంలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 34.45 లక్షల ఎకరాల్లో సన్నరకం వరి సాగైంది. కామారెడ్డి జిల్లాలో 2.40 లక్షల ఎకరాల్లో వరి పండించగా, ఇందులో 1,16,672 ఎకరాల్లో సన్నరకాలే సాగయ్యాయి. ఎంఎస్‌పీ ప్రకారం మేలు రకం ధాన్యానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 ధర ఉంది. ఈ ధరల ప్రకారం సన్నవడ్లను అమ్మితే నష్టమేనని రైతులు వాపోతున్నారు. క్వింటాకు రూ.2,500 చెల్లిస్తేనే గిట్టుబాటవుతుందని చెబుతున్నారు. మరోపక్క ఈసారి భారీ వర్షాలు, తెగుళ్లు రైతులను నిండా ముంచాయి. గతంలో సన్నాలు ఎకరాకు 25 – 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ఈసారి చాలాచోట్ల ఎకరాకు 10 – 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. నిరుడు దళారులు, రైస్‌ మిల్లర్లు క్వింటాల్‌కు రూ.2 వేలు చెల్లించి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఈసారి కొనేందుకు వ్యాపారులు, మిల్లర్లు ముందుకురాలేదు.  చదవండి:  (విజ్ఞతతో ఆలోచించండి.. మోసపోవద్దు)

మా దగ్గరే కొనండంటూ వాట్సాప్‌లో ప్రచారం 
ఒకపక్క తెగుళ్లు, భారీ వర్షాలతో దిగుబడి పడిపోవడం.. మరోవైపు, గిట్టుబాటు ధర లేకపోవడం, వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి లేక రైతులు కొత్త ఆలోచన చేశారు. పలువురు తాము పండించిన వడ్లను మర పట్టించేందుకు రైస్‌మిల్లులకు వరుస కడుతున్నారు. బియ్యంగా మార్చి 25 – 50 కిలోల చొప్పున బస్తాల్లో నింపి బయట వినియోగదారులకు అమ్ముతున్నారు. నాణ్యమైన బియ్యం కావడంతో క్వింటా రూ.4,200 నుంచి రూ.4,500 వరకు అమ్ముడుపోతున్నాయి. కొందరు రైతులు తమకు తెలిసిన వారికి, హోటళ్లకు బియ్యం సప్లై చేస్తున్నారు. ఇక, రైతులు వాట్సాప్‌ గ్రూపుల ద్వారా తమ వద్ద సన్నబియ్యం ఫలానా ధరకు లభిస్తాయని, రైతుల వద్దనే నేరుగా బియ్యం కొని రైతులకు లాభం చేకూర్చాలంటూ భారీగా ప్రచారం చేస్తున్నారు. దళారులు, వ్యాపారుల దగ్గర కొనే బదులు రైతుల దగ్గర లభించే కల్తీ లేని నాణ్యమైన బియ్యాన్ని కొందామంటూ చేపడుతున్న ప్రచారానికి విశేష స్పందన వస్తోంది. 

కామారెడ్డి జిల్లా గన్‌పూర్‌(ఎం) గ్రామానికి చెందిన యువ రైతు పేరు శ్రీధర్‌రావు మొన్నటి వానాకాలంలో 15 ఎకరాల్లో సన్న రకం వరి వేయగా భారీ వర్షాలతో దిగుబడి పడిపోయింది. 15 ఎకరాలకు 240 క్వింటాళ్ల వడ్లు వచ్చాయి. ఇందులో 137 క్వింటాళ్లు విక్రయించి, మిగతా 103 క్వింటాళ్లను బియ్యం పట్టిస్తే 42 క్వింటాళ్ల బియ్యం చేతికొచ్చింది. ఇందుకోసం రూ.5 వేల వరకు ఖర్చయ్యాయి. నాణ్యమైన బియ్యం కావడంతో క్వింటా రూ.4,500 చొప్పున అమ్ముడుపోతున్నట్టు రైతు శ్రీధర్‌రావు తెలిపారు. సన్నవడ్లకు క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,500 ఇస్తే మేలు జరిగేదని, ఇప్పుడున్న ధర ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడం వల్లే తానే బియ్యం పట్టించి అమ్ముకుంటున్నట్టు చెప్పాడు.  

కామారెడ్డి జిల్లా గన్‌పూర్‌(ఎం)కు చెందిన నర్సింహులు 8 ఎకరాల్లో సన్నవడ్లు పండించాడు. తెగుళ్లు, భారీ వర్షాలతో దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 170 బస్తాల ధాన్యాన్ని అమ్మి, 76 బస్తాలను మర పట్టించగా 30 క్వింటాళ్ల బియ్యం వచ్చాయి. ప్రభుత్వం సన్నాలు సాగు చేయాలని చెప్పి, మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఈ పరిస్థితుల్లో బయట అమ్మితే నష్టం తప్పదని భావించి ఇలా బియ్యం పట్టించి అమ్ముతున్నట్టు వివరించాడు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా