రైతులకు సన్నాల సంకటం!

17 Nov, 2020 12:19 IST|Sakshi

సన్నరకం ధాన్యం అమ్మకానికి రైతుల అవస్థలు

ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో నామమాత్రంగా కొనుగోళ్లు

దొడ్డు రకాలకే ప్రాధాన్యతనిస్తున్న నిర్వాహకులు 

మిల్లుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న రైతులు

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: సన్న రకాలు సాగు చేసిన రైతులు సంకట స్థితిలో పడ్డారు. ఈ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నామమాత్రంగా కొనుగోలు జరుగుతున్నాయి. దొడ్డు రకాల కొనుగోళ్లకే ఐకేపీ, పీఏసీఎస్‌ నిర్వాహకులు ప్రాధాన్యం ఇస్తుండటంతో రైతులు రైస్‌ మిల్లుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో, సూర్యాపేట జిల్లాలో 3.22 లక్షలు, ఖమ్మం జిల్లాలో 2.32 లక్షలు, నిజామాబాద్‌ జిల్లాలో 3.80 లక్షలు, కామారెడ్డి జిల్లాలో 2.43 లక్షలు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 3.98 లక్షల ఎకరాల్లో అత్యధికంగా వరి పంటను సాగు చేశారు.

ఈ జిల్లాల్లో సాగైన పంటలో 70 శాతం పైగా సన్నరకాలే. నియంత్రిత సాగు విధానంలో భాగంగా రైతులు సన్న రకాల సాగుకే మొగ్గు చూపారు. కానీ పంట చేతికి వచ్చాక ఈ పంట సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ధాన్యం అమ్మడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సన్న రకాలైన ఆర్‌ఎన్‌ఆర్, 108 సంపూర్ణ, సిద్ది 44, బీపీటీ, పూజలు, హెచ్‌ఎంటీ, వరంగల్‌ 44 రకాలు ఎక్కువగా సాగయ్యాయి. ఈ రకాల వరి కోతలు ప్రారంభమై ఇరవై రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం వీటిని అంతంత మాత్రంగానే కొనుగోళ్లు చేస్తుండటం గమనార్హం.  

మిల్లుల బాట  
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రైతులు ధాన్యం అమ్మకానికి మిల్లుల బాట పట్టారు. పంట కోసిన వెంటనే మిల్లుల్లో సన్న రకం కొనుగోలు చేస్తున్నారు. పది రోజులుగా ధాన్యం ట్రాక్టర్లతో మిల్లుల వద్ద రద్దీ పెరిగింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టోకెన్‌ సిస్టం పెట్టారు. తహసీల్దార్ల నుంచి టోకెన్‌ అందితేనే రైతులు పంట కోసుకొని మరుసటి రోజు మిల్లులకు ధాన్యం తీసుకెళ్లాలి. ఈ పరిస్థితితో టోకెన్ల కోసం కూడా రైతులు క్యూ కడుతున్నారు. మూడు రోజులకోసారి మం డల కార్యాలయాల్లో టోకెన్లు ఇస్తుండటంతో ఇవి దొరకని రైతులు పంట అంతా తూరి పోతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.  

కొనుగోలు చేయక తిప్పలు  
సూర్యాపేట జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌ 306 కేంద్రాలకు గాను 148 కేంద్రాలు తెరిచారు. కానీ వీటిలో చాలా కేంద్రాల్లో సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. మిల్లులకు లేదా వ్యవసాయ మార్కెట్లలో ఈ ధాన్యం అమ్మాలని వీటి నిర్వాహకులు రైతులకు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, వ్యవసాయ మార్కెట్లు కలిపి 441 కేంద్రాలకు 21 కేంద్రాలు తెరిచారు. పాలేరు డివిజన్‌లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలు అక్కడక్కడ ఏర్పాటు చేసినా వీటిల్లో సన్న ధాన్యం కొనుగోళ్లు లేకపోవడంతో ఈ జిల్లా రైతులు ఎక్కువగా మిర్యాలగూడలోని మిల్లులకు ధాన్యం అమ్మకానికి తీసుకెళ్తున్నారు.

సన్నరకం కొనుగోలు చేయడం లేదు

ఈ రైతు పేరు మట్టపల్లి గురులింగం. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్‌ ఇతని గ్రామం. మూడెకరాల్లో సన్న రకం వరి సాగు చేశాడు. నాలుగు రోజుల క్రితం పంట కోసిన ధాన్యాన్ని గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రానికి తీసుకెళ్లాడు. ఈ ధాన్యం కొనుగోలు చేయడం లేదని మిల్లులకు, లేదా వ్యవసాయ మార్కెట్‌కు తీసుకెళ్తే కొనుగోలు చేస్తారని ఐకేపీ నిర్వాహకులు ఉచిత సలహా ఇచ్చారు. ఎక్కడికి ధాన్యం తీసుకెళ్లాలో తెలియక ఈ కేంద్రంలోనే ధాన్యాన్ని ఆరబెట్టాడు. ప్రభుత్వం చెబితేనే సన్న రకం వేశామని, మరి ప్రభుత్వ కేంద్రాల్లో ఈ ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరన్నది గురులింగం ఆవేదన.

మరిన్ని వార్తలు