పత్తి టాస్క్‌ఫోర్స్‌పై దళారుల ఒత్తిడి!

25 Apr, 2022 03:55 IST|Sakshi

రాష్ట్రాన్ని భారీగా ముంచెత్తుతున్న నకిలీ పత్తి విత్తనాలు

టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో ఇష్టారాజ్యంగా విక్రయాలు

విత్తన దళారుల ఒత్తిడి వల్లే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు 

గుజరాత్, మహారాష్ట్రల నుంచి తెలంగాణకు భారీగా సరఫరా

ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైతులకు అంటగట్టిన వైనం

గతేడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే దాడులు.. ఈసారి దాడులే లేవు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు మళ్లీ ముంచెత్తుతున్నాయి. వ్యవసాయశాఖ స్తబ్దుగా ఉండటం, ఇప్పటివరకు ఎలాంటి టాస్క్‌ఫోర్స్‌ కూడా ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైతులకు ఈ విత్తనాలు చేరినట్టు సమాచారం. నిజానికి గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో విస్తృతంగా టాస్క్‌ఫోర్స్‌ దాడులు నిర్వహించి, దాదాపు 200 మంది విత్తన దళారులపై కేసులు పెట్టారు. నకిలీ విత్తనాలను కొంతవరకు అరికట్టగలిగారు. కానీ ఈసారి దళారులు, కంపెనీల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో.. నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

గుజరాత్, మహారాష్ట్రల నుంచి రాక.. 
రాష్ట్రంలో పత్తిసాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం ప్రచారం చేసినా.. గతేడాది సాధారణం కంటే తక్కువగా 46.25 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఈసారి 75 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మంచి ధర పలుకుతుండటంతో రైతులు కూడా ఈసారి పత్తిసాగుకు మొగ్గుచూపుతున్నారు. వానాకాలం సీజన్‌లో తొలి వర్షం పడగానే పత్తి నాట్లు మొదలవుతాయి. ఈ క్రమంలో 75 లక్షల ఎకరాలకు సరిపోయేలా కోటిన్నర పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేసేందుకు కంపెనీలు సన్నాహాలు చేసుకున్నాయి. విత్తన దళారులు ఇదే అదనుగా భావించి నకిలీ పత్తి విత్తనాలను రంగంలోకి తెచ్చారు. కొన్ని సంస్థలు నిషేధిత హెచ్‌టీ కాటన్‌ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్రల నుంచి తెలంగాణకు తరలించి జిల్లాల్లో తమ దళారులకు అప్పగించినట్టు తెలిసింది. పలుచోట్ల ఇప్పటికే ఈ విత్తనాలను రైతులకు అంటగట్టారు. 

టాస్క్‌ఫోర్స్‌ ఏదీ? 
గత ఏడాది నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ఆ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే విస్తృతంగా దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను, దళారులను పట్టుకుంది. ఇంతచేసినా ఆరేడు లక్షల ఎకరాల్లో నకిలీ విత్తనాలు, హెచ్‌టీ పత్తి సాగయింది. రైతులు భారీగా నష్టపోయారు. అయితే టాస్క్‌ఫోర్స్‌ దాడుల వల్ల నష్టపోయిన నకిలీ విత్తన మాఫియా ఈసారి ముందుగానే వ్యవసాయశాఖలోని కొందరు అధికారులను కలిసి ఒత్తిడి తెచ్చిందని.. భారీగా ముడుపులు సమర్పించుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ విత్తనాలకు సంబంధించి ఇప్పటివరకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయకపోవడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని అంటున్నారు. 

భారీగా వెనకేసుకునేందుకు.. 
విత్తన డీలర్లకు ఒక పత్తి విత్తన ప్యాకెట్‌ అమ్మితే రూ.25–30 వరకే లాభం వస్తుంది. అదే బీజీ–3 విత్తన ప్యాకెట్‌ను రైతుకు విక్రయిస్తే రూ.500 దాకా.. అదే లూజ్‌గా విక్రయిస్తే కిలోకు రూ.1,200 దాకా మిగులుతుంది. ఈ క్రమంలోనే డీలర్లు, విత్తన వ్యాపారులకు నకిలీ విత్తన మాఫియా ఎర వేసి.. వారి ద్వారా రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నాయి. సాధారణంగా చాలా మంది రైతులు పెట్టుబడికి డబ్బులు లేక.. డీలర్ల వద్ద అప్పుగా విత్తనాలు తీసుకుంటారు. ఇలాంటప్పుడు సదరు వ్యాపారి ఇచ్చిన నకిలీ విత్తనాలు తీసుకోవాల్సి వస్తోంది.  

మరిన్ని వార్తలు