లెక్కల్లో సూపర్‌ మ్యాన్‌

31 Aug, 2020 05:47 IST|Sakshi

ఫాస్టెస్ట్‌ హ్యూమన్‌ కేలిక్యులేటర్‌ మన హైదరాబాదీనే 

ప్రపంచ రికార్డు సాధించి సత్తాచాటిన నీలకంఠ భానుప్రకాశ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: అతనికి లెక్కలంటే లెక్కే లేదు..! అంకెలు.. సంఖ్యలే అతడి మెదడులో ఎప్పుడూ మెదులుతుంటాయి. గణితంతో అం దరూ కుస్తీ పడుతుంటే.. అతడు మాత్రం ఏ సమస్యనైనా క్షణాల్లో కంప్యూటర్‌ కన్నా వేగంగా పరిష్కరిస్తాడు.. అతడే హైదరాబాద్‌కు చెందిన నీలకంఠ భాను ప్రకాశ్‌. గణితంలో అత్యంత వేగంగా గణన ప్రక్రియ పూర్తిచేసిన మానవ కంప్యూటర్‌గా పేరొందాడు. నగరంలోని మోతీనగర్‌లో నివాసముంటున్న భానుప్రకాశ్‌ వయసు 21 ఏళ్లు. ఈ ప్రాయంలోనే అతను విశ్వవిఖ్యాత హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం విశేషం.

ఈనెల 15న లండన్‌లో నిర్వహించిన మైండ్‌ స్పోర్ట్‌ ఒలింపియాడ్‌లో గణితంలో అసాధారణ తెలివితేటలు చూపి గోల్డ్‌ మెడల్‌ సాధించి అత్యంత ఫాస్టెస్ట్‌ హ్యూమన్‌ కేలిక్యులేటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ పోటీలో సుమారు 13 దేశాలకు చెందిన 30 మంది మేధావులు పాల్గొన్నారు. ఐదేళ్ల ప్రాయం నుంచే అనితరసాధ్యమైన సాధనతో గణితంలో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారాలను కనిపెడుతున్న భాను ప్రకాశ్‌ ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో బీఎస్సీ మ్యాథమ్యాటిక్స్‌ (హానర్స్‌) చదువుతున్నాడు. భాను గతంలో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాడు. ఇప్పటివరకు 5 వరల్డ్‌ రికార్డులు, 50 లిమ్కా వరల్డ్‌ రికార్ట్స్‌ను సాధించి అందరి మన్ననలు పొందాడు. 

గణిత ల్యాబ్‌ ఏర్పాటే లక్ష్యం.. 
భాను ప్రకాశ్‌కు తండ్రి శ్రీనివాస్, తల్లి హేమ, సోదరి మన్మోహణి ఉన్నారు. జూబ్లీ హిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌ పాఠశాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యాభ్యాసం, ఇంటర్మీ డియట్‌ చుక్కా రామయ్య ఇన్‌స్టిట్యూట్‌లో పూర్తి చేశాడు. భవిష్యత్‌లో గణిత ల్యాబ్‌ను ఏర్పాటు చేసి గణితంలో అంతుచిక్కని సమస్యలను సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తన లక్ష్యం అని చెప్పాడు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సహా పలువురు ప్రముఖులు భానుప్రకాశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు